ఆర్‌యూ సమస్యలపై ఎస్టీ కమిషన విచారణ
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:41 PM
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు, ఇతర సమస్యలపై శుక్రవారం ఎస్సీ ఎస్టీ కమిషన విచారణ జరిపింది.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరిన అధ్యాపకులు
కర్నూలు అర్బన్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు, ఇతర సమస్యలపై శుక్రవారం ఎస్సీ ఎస్టీ కమిషన విచారణ జరిపింది. సెనేట్ హాలులో క్లస్టర్, రాయలసీమ యూనివర్సిటీల బోధన, బోధనేతర ఉద్యోగులు, అధికారులతో నిధులు, నియామకాలు, ఉద్యోగులు ప్రభుత్వ రిజిర్వేషన్లు పొందుతున్నారా..? అనే అంశంపై ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప సమీక్షించారు. ఈ సందర్భంగా గత పది నెలలుగా బడుగు, బలహీన వర్గాల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఎంబీఏ విభాగానికి చెందిన దళిత ఆధ్యాపకుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఒకే వేతనం వర్తించేలా చర్యలు తీసుకోవాలని నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ కోరారు. ఓ ఎస్టీ ప్రొఫెసర్‌ను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని కమిషన దృష్టికి తీసికెళ్లారు. దీనికి స్పందించిన ఉపకులపతి వి. వెంకట బసవరావు అలాంటిదేమీ లేదు.. అందరినీ కలుపుకుని వెళ్తామన్నారు. వర్శిటీలో గిరిజన, దళిత ఉద్యోగులకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తున్నారు.. అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉంది రికార్డులు ఏమైనా ఉన్నాయా? అని కమిషన సభ్యుడు వెంకటప్ప ప్రశ్నించారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని వర్శిటీకి చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యుడిని కోరారు. ఈ సమావేశంలో రెక్టార్ ప్రొఫెసర్ ఎన్ టీకే నాయక్, రిజిసా్ట్రర్ బోయ విజయకుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.