ఎస్టీ కమిషన్‌కు తీవ్ర అవమానం
ABN , Publish Date - May 31 , 2026 | 05:29 AM
అది ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం. జిల్లాలోని ఉన్నతాధికారులంతా హాజరు కావాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఐటీడీఏ పీవో అక్కడ ఉండాలి.
రంపచోడవరంలో కమిషన్ సమీక్ష సమావేశం
కలెక్టరు, పీవో, ఆర్డీవో సహా అధికారులంతా గైర్హాజరు
తక్షణమే చర్యలు తీసుకోండి.. సీఎం, సీఎస్‌లకు చైర్మన్ ఫిర్యాదు
రంపచోడవరం, మే 30 (ఆంధ్రజ్యోతి): అది ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం. జిల్లాలోని ఉన్నతాధికారులంతా హాజరు కావాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఐటీడీఏ పీవో అక్కడ ఉండాలి. శనివారం ఉదయం 11 గంటలకు కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి పోలవరం జిల్లా రంపచోడవరం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చారు. ఆ సమయానికి అక్కడ ఒక్క జిల్లా అధికారి కూడా లేరు. 12.30 గంటలకూ ఒక్కరు కూడా రాలేదు. కలెక్టరు దినేశ్‌కుమార్ మాత్రం.. తాను ముఖ్యకార్యదర్శి సమావేశానికి హాజరుకావాల్సి ఉందని, తర్వాత వస్తానని సమాచారం ఇచ్చారు. ఇతర ఉన్నతాధికారులెవరూ సమావేశానికి రాలేదు. రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు పాటించలేదు. దీనిపై చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అధికారులెవరూ హాజరుకానప్పుడు తాము సమీక్ష నిర్వహించడంలో అర్థం లేదని, గిరిజనాభివృద్ధిపై అధికారులకు శ్రద్ధలేదని చెప్పడానికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. తన సభ్యులతో కలిసి ఐటీడీఏ సమావేశ మందిరం నుంచి తన క్యాంపు కార్యాలయానికి వెళ్లి, గ్రీవెన్సు నిర్వహించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఐటీడీఏ పీవో ప్రశాంతకుమార్‌పై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులపై ఐటీడీఏకు, ఇక్కడి అధికారులకు శ్రద్ధ లేదని మండిపడ్డారు. గిరిజనాభివృద్ధిపై శ్రద్ధలేని అధికారులు ఇక్కడ పనిచేయడం సరికాదని, ఎస్టీ కమిషన్‌కు తీవ్ర అవమానం జరిగిందని, ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని, బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరతానని చైర్మన్ బొజ్జిరెడ్డి చెప్పారు.