Share News

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పీజీ కొత్త కోర్సులు

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:47 AM

ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి నుంచి రెండు కొత్త పీజీ కోర్సులను ప్రారంభించనున్నట్టు వైస్‌ చాన్సలర్‌ సతీశ్‌కుమార్‌ తెలిపారు.

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పీజీ కొత్త కోర్సులు

  • ఏఐ అనుసంధానంతో ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌, సైకాలజీ

  • మెరిట్‌ విద్యార్థులకు ఫీజు రాయితీ: వర్సిటీ వీసీ సతీశ్‌కుమార్‌

విజయవాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి నుంచి రెండు కొత్త పీజీ కోర్సులను ప్రారంభించనున్నట్టు వైస్‌ చాన్సలర్‌ సతీశ్‌కుమార్‌ తెలిపారు. ఏఐతో అనుసంధానంతో ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌, ఎమ్మెస్సీ సైకాలజీ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలియజేశారు. పెరుగుతున్న టెక్నాలజీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సులను రూపొందించినట్టు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినవని, పరిశోధనాత్మక, అన్వయ నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. క్రెడిట్‌ ఆధారిత విధానంలో రూపొందించిన ఈ కోర్సులు ఆధునిక విశ్లేషణాత్మక సామర్థ్యాలను పెంపొందించనున్నాయని వివరించారు. ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ ప్రోగ్రామ్‌లో ఆర్థిక సిద్ధాంతంతో పాటు డేటా సైన్స్‌, గణాత్మక పద్ధతులను సమన్వయం చేసి గ్లోబల్‌ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నామని వెల్లడించారు. ఎమ్మెస్సీ సైకాలజీ ప్రోగ్రామ్‌లో మానసిక ఆరోగ్యం, సంస్థాగత, విద్యారంగాల్లో ఏఐ ఆధారిత అనువర్తనాలతో పాటు ఆధునిక పరిశోధన పద్ధతులపై బోధనలు జరుగుతాయని సతీశ్‌కుమార్‌ చెప్పారు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసిన వారికి ఒక సంవత్సరం, మూడేళ్ల డిగ్రీ ఉన్న వారికి రెండేళ్ల కోర్సు ఉంటాయని తెలిపారు. కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని, మెరిట్‌ విద్యార్థులకు ఫీజు రాయితీలు కల్పిస్తున్నట్టు వీసీ ప్రకటించారు. డిగ్రీలో 9.0 సీజీపీఏ సాధించిన వారికి వందశాతం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపారు. 8.0 నుంచి 8.9 సీజీపీఏ ఉన్న వారికి 75 శాతం, 7.0 నుంచి 7.9 సీజీపీఏ ఉన్న వారికి 50 శాతం ఫీజు రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. వివరాల కోసం యూనివర్సిటీ అడ్మిషన్స్‌ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ డీన్‌ డాక్టర్‌ విశ్వనాథ్‌, ఎకనామిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఉబైద్‌ ముస్తాక్‌, సైకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ అయేషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 03:47 AM