Share News

ఉద్రిక్తత వెనుక కుట్రకోణం?

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:20 AM

శ్రీశైలంలో అసలేం జరిగింది? శివదీక్షా పరులు ఎందుకు సహనం కోల్పోయారు? గతంలో ఎన్నడూ లేని విధంగా రాళ్లతో తాళాలు పగలగొట్టడం, గర్భగుడిలోకే చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది

ఉద్రిక్తత వెనుక కుట్రకోణం?

  • స్థానిక రాజకీయాలతో టార్గెట్‌గా మారిన ఈవో.. ‘వైసీపీ భక్త అధికారి’ని తిరిగి రప్పించే యత్నం!

(నంద్యాల - ఆంధ్రజ్యోతి)

శ్రీశైలంలో అసలేం జరిగింది? శివదీక్షా పరులు ఎందుకు సహనం కోల్పోయారు? గతంలో ఎన్నడూ లేని విధంగా రాళ్లతో తాళాలు పగలగొట్టడం, గర్భగుడిలోకే చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? అటు అధికారుల మధ్య సమన్వయ లోపం... ఇటు ‘స్థానిక’ రాజకీయాల కారణంగానే ఈ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయా? సోమవారం శ్రీశైలం ఆలయంలో చోటు చేసుకున్న పరిణామాలపై తలెత్తుతున్న ప్రశ్నలివి! అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం...

ఒక్కసారిగా ఎందుకిలా...

మహా శివరాత్రికి 15-20 రోజుల ముందు నుంచే భారీగా శివభక్తులు, దీక్షాపరులు నల్లమల అడవి గుండా పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి చేరుకుంటారు. కానీ... ఈసారి పులుల గణన పేరుతో అటవీశాఖ అధికారులు పాదయాత్రపై ఆంక్షలు విధించారు. ఈనెల 8 నుంచి 15వ వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతిస్తామని తెలిపారు. దీంతో...వేల సంఖ్యలో భక్తులు 8వ తేదీన యాత్ర మొదలుపెట్టి... 9కి శ్రీశైలం చేరుకున్నారు. సామాన్య భక్తులు, దీక్షాపరులు, పాదయాత్రగా చేరుకున్న వారితో శ్రీశైలంలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. 20-25 వేల మంది వస్తారన్న అధికారుల అంచనా తప్పింది. సోమవారం శ్రీశైలానికి దాదాపు 60వేల మంది తరలి వచ్చారు. ఇక... 12వ తేదీ అర్ధరాత్రి నుంచి శివదీక్షాదారులకు స్పర్శ దర్శనం రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. ఇది రద్దీకి మరో ప్రధాన కారణం. దేవదాయ, అటవీ అధికారుల మధ్య సమన్వయం లోపంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రద్దీని ఊహించలేక శ్రీశైలం ఆలయ అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. సోమవారం ఆలయంలో దాదాపు 6 వేలమంది వరకూ భక్తులు ఉన్నారు. ఇక్కడ రద్దీని నియంత్రిస్తూ... బయటి కంపార్ట్‌మెంట్ల నుంచి భక్తులను అనుమతించాలి. కానీ... అనూహ్యంగా మనోహర గుండం వద్ద ఉన్న కంపార్ట్‌మెంట్లలోని కొందరు శివభక్తులు ఒక్కసారిగా లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఎలా జరిగిందన్నదే అసలు ప్రశ్న! అక్కడి ఆలయ సిబ్బంది ఎవరైనా తాళాలు తీసి వదిలారా? లేక శివభక్తులే నేరుగా తాళాలు పగలకొట్టి లోపలికి చొచ్చుకువచ్చారా? శివభక్తుల చేతుల్లోకి రాళ్లు ఎలా వచ్చాయి? ఇనుప గ్రిల్స్‌ను ధ్వంసం చేసేంతలా భక్తులను రెచ్చగొట్టింది ఎవరు?


పోలీసులు ఆపకపోయి ఉంటే!

భారీగా వచ్చిన భక్తులు, అనూహ్య ఘటనలతో సోమవారం ఆలయంలో ఒకింత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్పీ యుగంధర్‌బాబు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేజారి పోకుండా... దూరం వెళ్లాలంటూ లాఠీతో భక్తులను అదిలించారు. లేనిపక్షంలో... ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయం తరహాలో తొక్కిసలాట జరిగేది. అంతేకాదు.. భక్తులు గుంపుగా గర్భగుడిలోకి వెళ్లుంటే ఆలయ మర్యాదకూ అపచారం జరిగేదేమో! ఈ క్రమంలోనే పోలీసులు లాఠీలను ఎత్తి దూకుడును నియంత్రించారు. అంతేతప్ప భక్తులపై లాఠీచార్జి చేయలేదు. అయినప్పటికీ... వైసీపీ నేతలు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు.

ఈవోను టార్గెట్‌ చేశారా?

శ్రీశైలం ఆలయం కేంద్రంగా కొన్నాళ్లుగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఈవో శ్రీనివాసరావును బదిలీ చేయించేందుకు కొందరు ఆలయంలోని అధికారులు, ఒక ప్రజాప్రతినిధి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. టెండర్లు సహా పలు అంశాల్లో ఈవో నిక్కచ్చిగా వ్యవహరించడం నంద్యాల జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధికి మింగుడు పడటం లేదని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆలయ చైర్మన్‌తో కూడా ఆయనకు విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో శ్రీశైలం ఈవోగా పనిచేసి వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ‘వైసీపీ భక్త’ అధికారిని మళ్లీ శ్రీశైలానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఈవోను తప్పించేందుకు జరిగిన కుట్రలో భాగంగానే... సోమవారంనాటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయా?

4.jpg

Updated Date - Feb 12 , 2026 | 02:20 AM