Share News

శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:07 AM

శ్రీశైలం రిజర్వాయర్‌లో రోజుకో అడుగు నీటిమట్టం తగ్గుతోంది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీరు పూర్తిగా నిలిచిపోవడంతో రిజర్వాయర్‌ నీటిమట్టం పెరగడంలేదు.

శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం

  • ఎగువ నుంచి ఆగిన ప్రవాహం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

శ్రీశైలం రిజర్వాయర్‌లో రోజుకో అడుగు నీటిమట్టం తగ్గుతోంది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీరు పూర్తిగా నిలిచిపోవడంతో రిజర్వాయర్‌ నీటిమట్టం పెరగడంలేదు. మరోవైపు విద్యుదుత్పత్తి, రిజర్వాయర్‌ అనుబంధ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగంతో నీటినిల్వలు తగ్గుతున్నాయి. ఆదివారం జూరాలలో విద్యుదుత్పత్తి ద్వారా 21,463 క్యూసెక్కుల నీరు దిగువనున్న శ్రీశైలంలోకి వస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ పవర్‌ హౌస్‌ ద్వారా4,740 క్యూసెక్కులు, తెలంగాణ పవర్‌ హౌస్‌ ద్వారా42,315 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 876.70 అడుగులు ఉంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 171.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 12,389 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ఆదివారం 526.10 అడుగులకు చేరింది. సాగర్‌ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.050 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 160.63 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 45.770 కాగా, ప్రస్తుతం 28.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 3.071 టీఎంసీలకుగాను ప్రస్తుతం 3.05 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యారేజీలోకి వస్తోన్న 5,902 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. కర్ణాటకలోని ఆలమట్టి డ్యాం నుంచి ఆదివారం 25000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆలమట్టి గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకుగాను, ప్రస్తుతం 121.96 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Updated Date - Aug 17 , 2026 | 05:08 AM