Share News

శ్రీశైలంలో 149 టీఎంసీలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:31 AM

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడి అయిన శ్రీశైలం జలాశయానికి వడివడిగా చేరుకుంటోంది.

శ్రీశైలంలో 149 టీఎంసీలు

  • కొనసాగుతున్న భారీ వరద

  • 871 అడుగులకు చేరిన నీటిమట్టం

  • పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల

కర్నూలు/శ్రీశైలం/అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడి అయిన శ్రీశైలం జలాశయానికి వడివడిగా చేరుకుంటోంది. గురువారం సాయంత్రానికి 2,25,901 క్యూసెక్కుల ప్రవాహం డ్యాంలోకి వచ్చింది. రాత్రి సమయానికి 149.062 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. గరిష్ఠ సామర్థ్యానికి (215.810 టీఎంసీలు) చేరాలంటే ఇంకా 66 టీఎంసీలు రావాలి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 871.70 అడుగులు ఉంది. రాయలసీమ జిల్లా కరువు పల్లెల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తి శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ)కు గురువారం కృష్ణా జలాలు విడుదల చేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు నంద్యాల సర్కిల్‌ ఎస్‌ఈ శివశంకర్‌రెడి,్డ ఈఈ సుబ్రహ్మణ్యంరెడ్డి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొదట రెండు క్యూసెక్కులు విడుదల చేశారు. క్రమక్రమంగా సాయంత్రం ఆరు గంటలకు 4 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిని బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ కాలువకు మళ్లించి.. వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నింపిన తర్వాత ఇతర ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు మళ్లించనున్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రధాన లిఫ్ట్‌ మాల్యాల నుంచి గురువారం మరో పంపు ఆన్‌ చేశారు. రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. మరోవైపు.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోంది. గురువారం 6,589 క్యూసెక్కుల నీటిని వినియోగించి 3.435 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసి దిగువకు నీటిని విడుదల చేసింది. కుడిగట్టు కేంద్రంలోనూ ఉత్పాదనకు ఏపీ జల వనరుల శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.


శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రోజుకు 2 లక్షల క్యూసెక్కుల చొప్పున మరో నాలుగు రోజులపాటు ప్రవాహం కొనసాగుతుందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. 10వ తేదీనాటికి ఆలమట్టికి వరద తగ్గుతుందని.. ఆ మేరకు శ్రీశైలానికి కూడా ఇన్‌ఫ్లో తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే రోజుకు లక్ష క్యూసెక్కులకు తగ్గకుండా మరో పది రోజులపాటు వరద వస్తుందని అంటున్నారు. ఇక తుంగభద్ర డ్యాంకు ఇన్‌ప్లో 60,751 క్యూసెక్కులకు తగ్గిపోయింది. డ్యాం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 105.780 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 64.816 టీఎంసీల నీరుంది. ఇక నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గరిష్ఠ నిల్వ సామర్థ్యం 513.40 టీఎంసీలు కాగా.. గురువారం నాటికి 137.51 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వస్తుండగా.. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా అంతేమొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో గురువారం 28.87 టీఎంసీల నీరుంది. లీకుల ద్వారా 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు.


ఆలమట్టికి భారీ వరద..

ఎగువన ఆలమట్టి డ్యాంకు భారీ వరద కొనసాగుతోంది. గురువారం సాయంత్రం 1,33,196 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1,51,297 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యాంకు 1,50,684 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. 1,52,617 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ఈ డ్యాం దిగువన ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన భీమా నది జలాలు 45,727 క్యూసెక్కులు కృష్ణాలో కలుస్తున్నాయి. జూరాలకు 2,23,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో క్రస్ట్‌గేట్ల ద్వారా 1,88,608 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి అనంతరం 28,156 క్యూసెక్కులు.. మొత్తం 2,16,764 క్యూసెక్కులను తొలుత దిగువన శ్రీశైలానికి విడుదల చేశారు. అయితే రాత్రి 9 గంటల సమయానికి 2,04,706 క్యూసెక్కులకు తగ్గించారు.

Updated Date - Aug 07 , 2026 | 04:32 AM