Share News

శ్రీశైలం నుంచి.. సీమకు తాగునీరు

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:55 AM

మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీవర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. నీటి నిల్వలు 131 టీఎంసీలకు చేరుకోవడంతో.. రాయలసీమ దాహార్తి తీర్చాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

శ్రీశైలం నుంచి.. సీమకు తాగునీరు

  • పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేసిన అధికారులు

  • మల్యాల నుంచి హంద్రీ-నీవాకూ..

  • జలాశయంలో 131 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

  • ఎగువ నుంచి కొనసాగుతున్న భారీ ప్రవాహం

అమరావతి/కర్నూలు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీవర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. నీటి నిల్వలు 131 టీఎంసీలకు చేరుకోవడంతో.. రాయలసీమ దాహార్తి తీర్చాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమకు నీరు విడుదల చేయాలని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడిని ఆదేశించారు. బుధవారం రాత్రి తెలుగుగంగ ప్రాజెక్టు నంద్యాల ఎస్‌ఈ శంకర్‌రెడ్డి, ఇంజనీర్లు కృష్ణమ్మకు పూజలు చేసి 4000 క్యూసెక్కులను విడుదల చేశారు. తాగునీటి కోసమే నీరు వదులుతున్నందున.. మంత్రుల స్థాయిలో కాకుండా ఇంజనీరింగ్‌ అధికారులే నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి బుధవారం టెలికాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. మంత్రుల స్థాయిలో చేపడితే.. సాగునీటి కోసం అభ్యర్థనలు, డిమాండ్లు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలిచ్చారు. వాస్తవానికి మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌.. నందికొట్కూరు, పాణ్యం, శ్రీశైలం, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలతో కలసి శుక్రవారం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి తెలుగుగంగ, గాలేరు-నగరి కాలువలకు నీరు విడుదల చేయాలని మొదట ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే ఈ పరిస్థితుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిని విడుదల చేస్తే.. వారిని రైతులు సాగునీటి కోసం పట్టుబడితే గందరగోళం తలెత్తే ప్రమాదం ఉంది.


దీంతో సీఎం పై ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడాక.. మంత్రి నిమ్మల ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ఇలాగే కొనసాగితే మరో 100 టీఎంసీలు వచ్చే వీలుందన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 2027 జూన్‌ వరకూ శ్రీశైలం జలాలను తాగునీటి అవసరాల కోసం కాపాడుకోవడానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ‘హంద్రీ-నీవా సుజల స్రవంతి పరిధిలో తాగునీటికి 13 టీఎంసీలు అవసరమవుతాయి. అలాగే తెలుగుగంగ ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలను విడుదల చేస్తాం’ అని చెప్పారు. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల పరిధిలోనూ తాగునీటి అవసరాలకు 32 టీఎంసీలు అవసరమన్నారు. కాగా.. మంత్రి నిమ్మల ఆదేశాలతో బుధవారం సాయంత్రం హంద్రీ-నీవా పథకం ప్రధాన లిఫ్ట్‌ మల్యాల వద్ద ఆ ప్రాజెక్టు కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ రాజన్‌బాబు, ఇంజనీర్లు ఒక పంపు ఆన్‌ చేసి 350 క్యూసెక్కులు విడుదల చేశారు.

Updated Date - Aug 06 , 2026 | 04:56 AM