Share News

వాన కోసం.. వరద కోసం!

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:10 AM

ఎగువ నుంచి భారీ వరద కోసం జలాశయాలు.. భారీ వర్షాల కోసం చిన్న, మధ్యతరహా నీటి వనరులు ఎదురు చూస్తున్నాయి.

వాన కోసం.. వరద కోసం!

  • రిజర్వాయర్ల ఎదురుచూపులు

  • 113 జలాశయాల్లో 39 శాతమే నీరు

  • 434.79 టీఎంసీల నిల్వ

  • 38,599 చెరువుల్లో 123 టీఎంసీలు

  • శ్రీశైలం నిండాలంటే మరో 174 టీఎంసీలు రావాలి

  • 167 టీఎంసీలు వస్తేనే సాగర్‌ నిండుకుండ

అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి భారీ వరద కోసం జలాశయాలు.. భారీ వర్షాల కోసం చిన్న, మధ్యతరహా నీటి వనరులు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఆదివారం నాటికి 113 చిన్న, మధ్యతరహా రిజర్వాయర్లలో 39 శాతం నీరుంది. అంటే 434.79 టీఎంసీల నిల్వ ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జలధార-జలహారతి, సమర్థ నీటి యాజమాన్య నిర్వహణ కారణంగా 38,599 చెరువుల్లో 60 శాతం మేర 123.71 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీనాటికి సగటున 10.4 మీటర్ల లోతులో 624.87 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో రాష్ట్రమంతా ఈ ఏడాది మోస్తరు వర్షాలు కురిసినా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో గట్టెక్కుతామన్న విశ్వాసం అన్నదాతల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో 1014.27 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికిగాను 397.78 టీఎంసీల నిల్వలున్నాయి. మరో 616.5 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంది. అదేవిధంగా మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో 91.58 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను 37.02 టీఎంసీల నిల్వలున్నాయి. ఇంకో 54.56 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది. మొత్తంగా జలాశయాల్లో 1105.85 టీఎంసీల సామర్థ్యానికిగాను 39.79 శాతం మేర 434.79 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మరో 671 టీఎంసీల కొరత ఉంది.


ప్రధాన రిజర్వాయర్ల పరిస్థితిదీ..

శ్రీశైలం జలాశయం గరిష్ఠ సామర్థ్యం 215.158 టీఎంసీలు కాగా.. 41.05 టీఎంసీల జలాలే ఉన్నాయి. రిజర్వాయర్‌ నిండాలంటే ఎగువ నుంచి మరో 174.76 టీఎంసీల వరద అవసరం. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గరిష్ఠ నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 144.22 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 167.83 టీఎంసీల వరద వస్తే పూర్తిగా నిండుతుంది. సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ పంట కోసం పులిచింతలకు 3481 క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. 32.96 టీఎంసీల నిల్వ ఉంది. పులిచింతల నుంచి 400 క్యూసెక్కుల వరదను కిందకు వదులుతున్నారు. ఇక ఎగువన కర్ణాటకలో ఆలమట్టి సామర్థ్యం 129.72 టీఎంసీలకుగాను 22.8 టీఎంసీలు మాత్రమే నీరుంది. మరో 106.92 టీఎంసీల వరద వస్తే నిండుతుంది. జూరాల గరిష్ఠ సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను 7.52 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద వస్తే జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు జలాలు పారతాయి.

Updated Date - Jun 15 , 2026 | 04:11 AM