శ్రీశైలానికి ఇన్‌ఫ్లో నిల్!
ABN , Publish Date - Aug 16 , 2026 | 04:50 AM
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద ఇన్‌ఫ్లో శనివారం పూర్తిగా నిలిచిపోయింది. పై రాష్ట్రాల్లో వర్షాలు ఆగిపోవడంతో..
ఎగువ ప్రాంతాల్లో నిలిచిన వర్షాలు
జలాశయానికి పూర్తిగా ఆగిన వరద
ఆలమట్టి సహా పలు ప్రాజెక్టుల గేట్లు మూత
శ్రీశైలంలో 176 టీఎంసీల నిల్వకే పరిమితం
అమరావతి/శ్రీశైలం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద ఇన్‌ఫ్లో శనివారం పూర్తిగా నిలిచిపోయింది. పై రాష్ట్రాల్లో వర్షాలు ఆగిపోవడంతో.. కృష్ణా నదిపై ఉండే ఆలమట్టితో సహా ప్రధాన జలాశయాల గేట్లన్నీ మూసుకుపోయాయి. శ్రీశైలం జలాశయం గరిష్ఠ స్థాయి నిల్వ 215.810 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 176.331 టీఎంసీల నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు విద్యుదుత్పత్తి ద్వారా 72,640 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లో గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గానూ 158 టీఎంసీల నిల్వ ఉంది. కాగా, శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాల కోసం వదులుతున్న కృష్ణా జలాలతో విద్యుదుత్పత్తిని గరిష్ఠ స్థాయిలో కాకుండా కొద్దిగా తగ్గించాలని ఏపీజెన్కోను రాష్ట్ర జలవనరుల శాఖ కోరింది.
పెరిగిన గోదావరి నీటిమట్టం
పోలవరం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఎగువ కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 2,44,209 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్టు స్పిల్‌వే డీఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు.