Share News

‘శ్రీశైలం ఘటన’లో తొలి వికెట్‌

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:13 AM

‘శ్రీశైలం ఉద్రిక్తతల’ ఘటనలో తొలి వికెట్‌ పడింది. శ్రీశైలం ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ను (ఐఎ్‌ఫఎస్‌) బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

‘శ్రీశైలం ఘటన’లో తొలి వికెట్‌

  • శ్రీశైలం ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ బదిలీ

  • ఆ ఘటనపై సీఎంవో సీరియస్‌.. త్వరలో మరికొందరిపైనా వేటు!

నంద్యాల, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : ‘శ్రీశైలం ఉద్రిక్తతల’ ఘటనలో తొలి వికెట్‌ పడింది. శ్రీశైలం ఫీల్డ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ను (ఐఎ్‌ఫఎస్‌) బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు పోస్టింగ్‌ కేటాయించకుండా ‘పీసీసీఎ్‌ఫ’కు (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌) రిపోర్టు చేయాలని ఆదేశించారు. గుంటూరు కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ విభాగంలో పనిచేస్తున్న కాశీవిశ్వనాథ్‌కు శ్రీశైలం ఫీల్డ్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు. శ్రీశైలంలో జరిగిన పరిణామాలపై ‘ఉద్రిక్తత వెనుక కుట్రకోణం..’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం ఆధారంగా సీఎంవో చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. సీఎంవో ఆదేశాలతో ఇప్పటికే ప్రత్యేక ఇంటిలిజెన్స్‌ విభాగం రంగంలోకి దిగి రహస్య విచారణ ప్రారంభించింది. శివభక్తుల పాదయాత్రకు ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఆలస్యంగా అనుమతి ఇవ్వడమే ఉద్రిక్తతలకు దారితీసిందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. మరికొందరు అధికారులపైనా వేటు వేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీశైలం పాదయాత్ర జరిగే అటవీ పరిధిలో ఆత్మకూరు, మార్కాపురం డీఎ్‌ఫవోలు ఉన్నారు. శ్రీశైల బ్రహ్మోత్సవాలకు వారం రోజుల ముందుగానే మంత్రుల బృందం అటవీ, జిల్లా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆత్మకూరు, మార్కాపురం డీఎ్‌ఫవోలు సైతం హాజరయ్యారు. సమీక్షలో జరిగిన అంశాలను శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాల సన్నాహాలను పర్యవేక్షిస్తున్న శ్రీశైలం ఫీల్డ్‌ డైరెక్టర్‌ దృష్టికి ఆ డీఎ్‌ఫవోలు తీసుకెళ్లారా లేక తొక్కిపెట్టేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా పాదయాత్రకు అనుమతులు డీఎఫ్‌వో స్థాయి అధికారులే ఇస్తారు. కాగా, ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఈనెల 6నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. అసలు అనుమతి లభిస్తుందో,లేదోనని అప్పటివరకు సందిగ్ధతలో ఉన్న శివభక్తులు ఈ ప్రకటన రాగానే వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఎనిమిదో తేదీన శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఆత్మకూరు డీఎ్‌ఫవో వ్యవహారశైలి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉన్నదని, ఆయనపైనా త్వరలో వేటు పడొచ్చని సమాచారం.

Updated Date - Feb 14 , 2026 | 03:13 AM