శ్రీశైలానికి తగ్గిన వరద
ABN , Publish Date - Aug 10 , 2026 | 03:49 AM
శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు ఆగిపోవడంతో ఆలమట్టి, నారాయణపూర్ నుంచి అవుట్‌ఫ్లో బాగా తగ్గిపోయింది.
కర్నూలు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు ఆగిపోవడంతో ఆలమట్టి, నారాయణపూర్ నుంచి అవుట్‌ఫ్లో బాగా తగ్గిపోయింది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. దరిమిలా శ్రీశైలానికి వరద తగ్గుతోంది. ఆదివారం ఉదయం డ్యాం వద్ద 1,67,520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. సాయంత్రం 1,01,384 క్యూసెక్కులకు పడిపోయింది. కేవలం 12 గంటల్లోనే 60 వేల క్యూసెక్కులు తగ్గింది. డ్యాం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 181.05 టీఎంసీలు చేరింది. ఉదయం కుడిగట్టు విద్యుత్కేంద్రం ద్వారా ద్వారా ఏపీ 26,093 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా తెలంగాణ 22,419 క్యూసెక్కులు ఉపయోగించి విద్యుదుత్పాదన చేశాయి. ఆ నీటిని దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేశాయి. సాయంత్రానికి తెలంగాణ విద్యుదుత్పత్తి ఆపేసింది. ఏపీ మాత్రం వినియోగాన్ని 4,563 క్యూసెక్కులకు తగ్గించింది. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా 2,500 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. రాయలసీమలోని జలాశయాలు నింపేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్‌ఆర్‌ఎంసీ కాలువకు 8 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు ఎత్తిపోస్తోంది. సాగర్‌కు 50,678 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 312.50 టీఎంసీలకు గాను డ్యాంలో 145.653 టీఎంసీలున్నాయి. సీమకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర జలాశయానికి కూడా వరద 40,799 క్యూసెక్కులకు పడిపోయింది. డ్యాం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 78.64 టీఎంసీలున్నాయి. ఏపీ, కర్ణాటక ఇచ్చిన ఇండెంట్ మేరకు తాగునీటి కోసం వివిధ కాలువలకు 1,670 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు.
ఎగువ ప్రాజెక్టుల పరిస్థితి ఇలా
ఆలమట్టి ప్రాజెక్టుకు సాయంత్రం ఆరు గంటలకు 1,04,777 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా.. 118.221 టీఎంసీలు నిల్వ చేసి 42,500 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాంకు 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాతోంది. దిగువకు 35 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాలకు 57 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.