శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ 4 లేన్లుగా!
ABN , Publish Date - Aug 10 , 2026 | 03:32 AM
శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 2లేన్లుగా నిర్మించాలని భావించిన..
ఒకే పిల్లర్‌పై 2 ప్రొవిజన్లు.. 4 లేన్లు.. కొత్త డీపీఆర్
మోర్త్ నుంచి ఎన్‌హెచ్‌ఏఐకు ప్రాజెక్టు బదిలీ
క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎన్‌హెచ్‌ఏఐ బృందం
మన్ననూరు-పాతాళగంగ..54 కి.మీ. మేర కారిడార్
గతంలో 2 లేన్లకు రూ.7,668 కోట్లతో ప్రతిపాదనలు
భవిష్యత్తు దృష్ట్యా 4లేన్లకు పెంచాలని నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 2లేన్లుగా నిర్మించాలని భావించిన కారిడార్‌ను 4లేన్లుగా నిర్మించాలని నిర్ణయించింది. అలాగే, ఈ ప్రాజెక్టును కేంద్ర రోడ్డు-రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్) నుంచి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటి నుంచి మోర్త్- తెలంగాణ విభాగమే అన్ని వ్యవహారాలను పరిశీలిస్తోంది. అయితే, ఆమనగల్, డిండి, అలాగే డిండి నుంచి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమయ్యే మన్ననూరు చెక్‌పోస్టు వరకు ఉన్న రోడ్లతోపాటు కారిడార్ అవతలివైపు పనులన్నీ కూడా ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో ఉన్నాయి. ఈ మధ్యలో 54 కిలోమీటర్ల మేర ఉన్న కారిడార్ మాత్రమే మోర్త్ పరిధిలో ఉంది. అయితే, అన్ని రోడ్లు ఒకే విభాగం పరిధిలో ఉంటే ప్రాజెక్టుల సమగ్ర నివేదికల నుంచి టెండర్ల దశ వరకు సమావేశాలు, ఇతరత్రా టెక్నికల్ వ్యవహారాల పర్యవేక్షణకు అనువుగా ఉంటుందని కేంద్ర రోడ్డు-రవాణా మంత్రిత్వ శాఖ అభిప్రాయం వక్తం చేసింది. దీంతో ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను ఎన్‌హెచ్‌ఏఐకు బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులతో కలిసి ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ విభాగం క్షేత్రస్థాయిలో పర్యటించినట్టు సంబంధిత అధికారిక వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పాయి.
2 లక్షల చెట్లపై ప్రభావం.. కొత్త డీపీఆర్
హైదరాబాద్ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా (ఎన్‌హెచ్-765) ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు ప్రస్తుతం గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు తుక్కుగూడ దగ్గర ఓఆర్‌ఆర్ దిగిన తర్వాత నుంచీ డిండి వరకు ఒక రోడ్డును ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించగా, ఆ తరువాత కొంగర్‌కలాన్ నుంచి ఆమనగల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును ప్రతిపాదించింది. ఆమనగల్ నుంచి మన్ననూరు చెక్‌పోస్టు వరకు మరో రోడ్డును ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదించింది. ఫలితంగా ఏపీకి వెళ్లేందుకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. మన్ననూరు నుంచి శ్రీశైలానికి దగ్గర్లోని పాతాళగంగ వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉండడంతో సాధారణ రోడ్డుకు బదులుగా 20-25 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఈమేరకు 2లేన్లతో కూడిన కారిడార్ నిర్మాణానికి రూ.7,668 కోట్లు అవసరమని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో మోర్త్ పేర్కొంది. అయితే, తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్మాణ బాధ్యతలను ఎన్‌హెచ్‌ఏఐకి కేంద్రం బదిలీ చేసింది. దాంతో ఎన్‌హెచ్‌ఏఐ-తెలంగాణ విభాగం అఽధికారులు వైల్డ్‌లైఫ్ బోర్డు సభ్యులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. భవిష్యత్‌లో పెరగబోయే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని.. ప్రస్తుతం ప్రతిపాదించిన 2 లేన్లను 4 లేన్లుగా చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందుకోసం రెండు వైపులా ప్రయాణం సాగేలా పేవ్‌డ్ షోల్డర్లతో ఒకే పిల్లర్‌పై రెండు ప్రొవిజన్లు ఇచ్చే అంశాన్నీ అధికారులు పరిశీలించారు.
కారిడార్‌ను మొదట రెండు లేన్లుగా నిర్మించి, ఆ తర్వాత మరో రెండు లేన్లతో కూడిన రోడ్డు వేస్తే ఎలా ఉంటుందన్న అంశమూ చర్చకు వచ్చింది. కానీ, ఇప్పుడు 2లేన్లుగా నిర్మాణం చేపడితే.. ప్రాజె క్టు పూర్తయ్యేలోపు ట్రాఫిక్ పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకేసారి 4 లేన్లతో నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌ను సైతం 2 లేన్లకు బదులు 4 లేన్లుగా నిర్మించడమే మంచిదన్న విషయాన్ని కేంద్రానికి తెలియజేయనున్నారు. ప్రాజెక్టు ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోకి రావడంతో ఈ అంశాలన్నింటినీ పొందుపరుస్తూ కొత్తగా మరో డీపీఆర్‌ను సిద్ధం చేయనున్నట్టు తెలిసింది. కారిడార్ నిర్మాణంతో దాదాపు 2 లక్షల చెట్లపై ప్రభావం పడుతుందని ప్రాఽథమికంగా తేలినట్టు సమాచారం.
గతంలో 50వాతం ఖర్చు భరిస్తామన్న రాష్ట్రం
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఆర్థికంగా అంత లాభదాయకం కాదని, ఆశించిన స్థాయిలో ఆర్థిక సామర్ధ్యత ఉండదని గతంలో ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తెలియజేయగా.. ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో అన్నిసార్లు ఆర్థిక సామర్ధ్యతనే చూడకూడదన్న అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఈ కారిడార్ నిర్మాణంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మార్గం సుగమం కావడంతోపాటు ఏపీ వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందని, రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, వ్యాపార లావాదేవీలు మెరుగుపడుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు ఖర్చులో 50 వాటాను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ప్రాజెక్టు మోర్త్ నుంచి ఎన్‌హెచ్‌ఏఐకు బదిలీ కాగా, ప్రాజెక్టును 4 లేన్లుగా నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రాజెక్టు ఖర్చులో 50శాతం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన విషయంతోపాటు ఖర్చు ఎంత పెరుగుతుందన్న దానిపై త్వరలోనే అధికారులు చర్చించనున్నట్టు సమాచారం.