శ్రీశైలం దేవస్థానానికి ఎమ్మెల్యే బూచేపల్లి టోకరా!
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:38 AM
శ్రీశైలం దేవస్థానానికి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి టోకరా వేసినట్లు సమాచారం. దేవస్థానానికి చెందిన కాటేజీని మూడేళ్లుగా..
మూడేళ్లుగా కాటేజీ అప్పగించకుండా సొంతానికి
15 రోజుల్లో అప్పగించాలని దేవస్థానం నోటీసులు
దర్శి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానానికి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి టోకరా వేసినట్లు సమాచారం. దేవస్థానానికి చెందిన కాటేజీని మూడేళ్లుగా అప్పగించకుండా వాడుకుంటున్నట్లు తెలిసింది. బూచేపల్లి కుటుంబీకులు శ్రీశైలం లో ప్లాట్ నం.34లో కాటేజీ కోసం స్థలం తీసుకుని నిర్మించారు. నిబంధనల ప్రకారం ఏడాదిలోపు కాటేజీని దేవస్థానానికి అప్పగించాల్సి ఉంది. 2023 మేలోనే అప్పగించాల్సి ఉన్నా, ఇప్పటికీ వారే వినియోగించుకుంటున్నారు. దీంతో 15 రోజులలోపు కాటేజీని అప్పగించాలని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18లోగా అప్పగించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నిబంధనల ప్రకారం కాటేజీలను నిర్మించిన దాతలకు ఏడాదిలో 30 రోజులు ఉచితంగా, మధ్యలో ఎప్పుడైనా అత్యవసరమైతే సగం ధరకు ఇస్తారు. గత మూడేళ్లుగా కాటేజీని బూచేపల్లి ఆధీనంలో ఉంచడం వల్ల దేవస్థానానికి వచ్చే అద్దెల ఆదాయం ఆగింది. సామాన్య భక్తుడు ఒక్కరోజు ఆలస్యం చేస్తే అపరాధ రుసుం ముక్కుపిండి వసూలు చేసే అధికారులు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించారో, దీనిలో ఆంతర్యమేమిటోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.