Share News

శ్రీశైలంలో అడుగంటిన నీటి నిల్వలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:38 AM

రెండు తెలుగు రాష్ట్రాలూ శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిలిపివేశాయి. డ్యాంలో నీటి నిల్వలు అడుగంటడంతో ఆదివారం రాత్రే ఆపేశామని ఏపీ జలవనరుల శాఖ కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా తెలిపారు.

శ్రీశైలంలో అడుగంటిన నీటి నిల్వలు

  • కుడి, ఎడమన విద్యుదుత్పత్తి బంద్‌

  • గత 10 నెలల్లో రికార్డు స్థాయిలో ఉత్పత్తి

  • ఏపీ 2,060.. తెలంగాణ 2,725 మిలియన్‌ యూనిట్లు

  • విద్యుదుత్పాదనకు 346 టీఎంసీలు వాడిన ఏపీ

  • 523.60 టీఎంసీలు వినియోగించిన తెలంగాణ

  • ప్రస్తుతం జలాశయంలో ఉంది 44 టీఎంసీలే

కర్నూలు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాలూ శ్రీశైలం కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిలిపివేశాయి. డ్యాంలో నీటి నిల్వలు అడుగంటడంతో ఆదివారం రాత్రే ఆపేశామని ఏపీ జలవనరుల శాఖ కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా తెలిపారు. గత పది నెలల్లో కుడి గట్టులో ఏపీ, ఎడమ గట్టున తెలంగాణ రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేశాయి. 2025-26 నీటి సంవత్సరంలో శ్రీశైలం డ్యాంకు రికార్డు స్థాయిలో 2,385.63 టీఎంసీల వరద చేరింది. దీంతో ఇరు రాష్ట్రాలూ తమ అవసరాల కోసం భారీగా విద్యుత్‌ ఉత్పత్తి చేశాయి. ఏపీ వైపు నిరుడు జూన్‌ 1 నుంచి ఆదివారం వరకు 2,060.01 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేశారు. వాస్తవంగా కుడిగట్టు విద్యుత్కేంద్రం సామర్థ్యం 1,752 మిలియన్‌ యూనిట్లు. సగటున ఏడాదిలో వెయ్యి మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. 2007-08లో 1,133 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో 1,166.41 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. తాజా నీటి సంవత్సరంలో 2,060.01 యూనిట్లతో ఆ రికార్డును బద్దలు కొట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఇదే అత్యధిక ఉత్పత్తి.


ఇందుకోసం ఏపీ దాదాపు 346.76 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. తెలంగాణ కూడా ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 2,725.30 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆరు యూనిట్ల ద్వారా 2007-08లో ఆ రాష్ట్రం 2,544.004 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది. ఆ రాష్ట్రం 523.60 టీఎంసీలు వినియోగించినట్లు జలవనరుల శాఖ ఇంజనీర్లు తమ నివేదికలో పేర్కొన్నారు. వరద సమయంలోనే కాకుండా నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాలువల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం జలాశయం నుంచి సమయానుకూలంగా విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తూ వచ్చారు.


తగ్గిన నిల్వలు..

ప్రస్తుతం శ్రీశైలం జలాశయం అడుగంటింది. సోమవారం నాటి నీటి లెక్కల ప్రకారం డ్యాం నీటి నిల్వ 44.08 టీఎంసీలకు తగ్గిపోయింది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ప్రస్తుతం 824.10 అడుగుల మట్టంలో 44.08 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 821.90 అడుగుల లెవల్‌లో 42.21 టీఎంసీలు నిల్వ ఉండేది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కుల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు ఎత్తిపోస్తే.. ఏపీ ప్రభుత్వం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 741 క్యూసెక్కులు ఎత్తిపోస్తోంది.

Updated Date - Mar 31 , 2026 | 05:39 AM