Share News

మూఢ నమ్మకాలకు ముగ్గురు బలి

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:04 AM

మూఢనమ్మకాలు ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. చనిపోయిన కుటుంబ పెద్ద దెయ్యం రూపంలో వేధిస్తున్నాడని, దాసులు (మంత్రగాళ్ల) వద్దకు వెళ్లినా ఉపశమనం లేదని..

మూఢ నమ్మకాలకు ముగ్గురు బలి

  • ఇంటి పెద్ద దెయ్యమై వేధిస్తున్నాడని భావన

  • గడ్డిమందు తాగి తల్లి, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య

జలుమూరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): మూఢనమ్మకాలు ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. చనిపోయిన కుటుంబ పెద్ద దెయ్యం రూపంలో వేధిస్తున్నాడని, దాసులు (మంత్రగాళ్ల) వద్దకు వెళ్లినా ఉపశమనం లేదని ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మర్రివలస గ్రామానికి చెందిన ముద్ద అప్పయ్య, దాలెప్పమ్మకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. వారిలో దాలమ్మను భర్త విడిచి పెట్టడంతో పుట్టింటిలోనే జీవనం సాగిస్తోంది. చిన్నకుమార్తె దివ్యాంగురాలు కావడంతో వివాహం కాక తల్లిదండ్రుల వద్దే ఉంది. 5 నెలల క్రితం అప్పయ్య మృతి చెందాడు. అప్పటి నుంచి దెయ్యంగా మారి తమను మానసికంగా బాధపెడుతున్నాడన్న మూఢ నమ్మకంతో తల్లీకూతుళ్లు దాసుల వద్దకు వెళ్లారు. అయినా తమకు బాధలు తప్పడంలేదని ముగ్గురూ శుక్రవారం ఉదయం ఇంటివద్దే గడ్డిమందు తాగారు. ఇరుగుపొరుగు వారు గమనించి 108కి సమాచారం అందించారు. వారు వచ్చేటప్పటికే దాలెప్పమ్మ (65) మృతి చెందింది. కుమార్తెలు దాలమ్మ (45), సరస్వతి (38)ని బుడితి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికి సరస్వతి మృతి చెందగా, దాలమ్మ రాత్రి మరణించింది. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బి. అశోక్‌బాబు తెలిపారు.

Updated Date - Jul 11 , 2026 | 05:06 AM