Share News

బిడ్డల గొంతుకోసి.. ఆపై తానూ కోసుకున్న తల్లి

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:12 AM

ఓ తల్లి తన ఇద్దరు బిడ్డల గొంతుకోసి చంపి.. తానూ గొంతు కోసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో సోమవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది.

బిడ్డల గొంతుకోసి.. ఆపై తానూ కోసుకున్న తల్లి

  • మూడేళ్లు, 4 నెలల పసికందుల మృతి

  • కొన ఊపిరితో తల్లి.. ఆస్పత్రిలో చికిత్స

  • సిక్కోలు జిల్లాలో ఘోరం.. కుటుంబ కలహాలే కారణం!

ఆమదాలవలస, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ఓ తల్లి తన ఇద్దరు బిడ్డల గొంతుకోసి చంపి.. తానూ గొంతు కోసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో సోమవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వెదుళ్లవలసకు చెందిన కూర్మాపు రమణ, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు భవాని (3), చాందిని (4నెలలు) ఉన్నారు. భర్త రమణ ఉపాధి నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నల్లగొండకు వెళ్లాడు. వరలక్ష్మి వెదుళ్లవలసలోనే ఉంటోంది. ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం రాత్రి ఇంట్లో నిద్రయింది. ఆమె అత్త లక్ష్మి బయట వరండాలో పడుకుంది. మంగళవారం ఉదయం అత్త లోపలికి వెళ్లి చూసేసరికి.. చిన్నారులు, కోడలు రక్తపు మడుగులో కనిపించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి పరిశీలించగా.. చిన్నారులిద్దరూ విగతజీవులుగా కనిపించారు. కొన ఊపిరితో ఉన్న వరలక్ష్మిని 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. శ్రీకాకుళం డీఎస్పీ మంగళవారం ఉదయం గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. వరలక్ష్మి కుటుంబీకులను ప్రశ్నించారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోందని వెల్లడించారు. వరలక్ష్మి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. వరలక్ష్మి పరిస్థితి విషమంగానే ఉందన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 05:15 AM