రాష్ట్రపతి విందుకు సిక్కోలు విద్యార్థిని
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:18 AM
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందుకు రాష్ట్రం నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇప్పలి సంజన అనే విద్యార్థినికి ఆహ్వానం అందింది.
దేశవ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో సంజన
పలు అంశాలపై ప్రాజెక్టుల తయారీతో ప్రతిభ
నరసన్నపేట, జనవరి 22(ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందుకు రాష్ట్రం నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇప్పలి సంజన అనే విద్యార్థినికి ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఎంపిక కాగా.. అందులో సంజన ఒకరు. ఆమె ప్రస్తుతం శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పలి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గత మూడు సంవత్సరాల్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్‌కు పలు ప్రాజెక్టులు తయారు చేసి పంపింది. వీటిల్లో డ్యూయెల్ యాక్సిస్ సోలార్ ట్రాకర్ సిస్టమ్‌పై ఓ ప్రాజెక్టును రూపొందించింది. సదరు విద్యార్థిని ప్రతిభను గుర్తించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి అయోగ్ సంజనకు రాష్ట్రపతి భవన్ విందులో పాల్గొనే అవకాశంపై సిఫారసు చేసింది. రాష్ట్రపతి భవన్‌లో విందుకు ఆహ్వానం రావడంపై సంజన హర్షం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు ఇచ్చిన మార్గదర్శకాలతోనే తాను ప్రాజెక్టులను రూపొందించానని తెలిపింది.