సిక్కోలు ఇసుకలో.. అరుదైన సిరులు!
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:58 AM
మన కళ్ల ముందే సముద్రతీరంలో విస్తరించి ఉన్న ఇసుక తిన్నెలు.. భవిష్యత్తులో ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసించబోతున్నాయి.
మన తీర ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్
స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు..
కంప్యూటర్లు, రాకెట్ ఇంజన్ల తయారీలో ఇవే కీలకం
ప్రపంచ గతిని మార్చే శక్తి తీరంలోని లోహాలకు
చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్ అడుగులు
సిక్కోలు ముఖచిత్రం మార్చేలా సీఎం చంద్రబాబు వ్యూహం
మూలపేట నుంచే ‘ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్’ ప్రారంభం
శ్రీకాకుళం కేంద్రంగా ‘రేర్ ఎర్త్’ వాల్యూ చైన్ పరిశ్రమలు
స్మార్ట్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు.. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎల్‌ఈడీ లైట్ల వరకూ.. రక్షణ రంగ పరికరాల నుంచి రాకెట్ ఇంజన్ల వరకూ.. ఏది తయారు చేయాలన్నా భూమి పొరల్లో లభించే అరుదైన లోహాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) చాలా ముఖ్యం. ‘సూపర్ లోహాలు’గా భావిస్తున్న ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేకుంటే స్మార్ట్ ఫోన్ పనిచేయదు.. ఎలక్ట్రిక్ కారు నడవదు. ఆధునిక సాంకేతికతలో ఎంతో కీలకంగా మారిన వీటి ఉత్పత్తి, రిఫైనింగ్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో సుమారు 6 శాతం నిల్వలు ఉన్నప్పటికీ.. ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ. ఈ విషయంలో చైనా గుత్తాధిపత్యానికి గండికొట్టేలా.. భారత్ అడుగులు వేస్తోంది. ఈ అరుదైన ఖనిజ సంపదను వెలికి తీసేందుకు ‘రేర్ ఎర్త్ కారిడార్’ను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించగా.. దాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
(శ్రీకాకుళం - ఆంధ్రజ్యోతి)
మన కళ్ల ముందే సముద్రతీరంలో విస్తరించి ఉన్న ఇసుక తిన్నెలు.. భవిష్యత్తులో ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసించబోతున్నాయి. వెనుకబాటుకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీకాకుళం జిల్లా.. రానున్న రోజుల్లో దేశ రక్షణ, ఎలకా్ట్రనిక్స్ రంగాలకు కీలక కేంద్రంగా మారనుంది. శ్రీకాకుళం సముద్ర తీరంలోని ఇసుకే దీనికి ప్రధాన కారణం..! ఇసుకే కదా.. అని తేలికగా తీసిపారేయాల్సిన పనిలేదు.
ఈ ఇసుకలోనే సిరులు కురిపించే అరుదైన ఖనిజ సంపద దాగి ఉంది. అరుదైన భూ లోహాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్)గా పిలిచే వాటిపైనే ఇప్పుడు ప్రపంచం దృష్టి పడింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న తాజా నిర్ణయాలు జిల్లాకు పారిశ్రామిక శోభ ను తీసుకురానున్నాయి. అటు ప్రకృతి ప్రసాదించిన వనరులు, ఇటు సీఎం చంద్రబాబు దార్శనికత వెరసి.. సిక్కోలు దశ దిశ మారే సమయం ఆసన్నమైంది..!
చైనా ఆధిపత్యానికి గండి కొట్టేలా..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు, ఎలక్ట్రిక్ కార్ల నుంచి క్షిపణుల వరకు ప్రతి అత్యాధునిక పరికరం తయారీలో ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’ కీలకం. ఇప్పటివరకు వీటి ఉత్పత్తి, శుద్ధిలో దాదాపు 90 శాతం చైనాదే ఏకఛత్రాధిపత్యం. భవిష్యత్తులో చైనా సరఫరా నిలిపివేస్తే ప్రపంచం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా, జపాన్ వంటి దేశాలు ‘చైనా ప్లస్ వన్’ విధానంలో భారత్ వైపు చూస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక రేర్ ఎర్త్ నిల్వలున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. అందులోనూ శ్రీకాకుళం తీరంలో లభించే మోనజైట్, ఇల్మనైట్, జిర్కాన్ వంటి ఖనిజాలు అత్యంత నాణ్యమైనవిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మూలపేట పోర్టు.. పారిశ్రామిక ముఖద్వారం
ఈ అరుదైన సంపదను ఉపయోగించుకుని శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి బాట పట్టించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణం అవుతున్న మూలపేట పోర్టు కేంద్రంగా భారీ ‘ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్’ (తూర్పు తీర పారిశ్రామిక కారిడార్) రూపుదిద్దుకోనుంది. మూలపేట నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వరకు ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని, దీనికి శ్రీకాకుళమే ‘స్టార్టింగ్ పాయింట్’ కావాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనివల్ల పోర్టు ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాలు జిల్లాలో భారీగా విస్తరించే అవకాశం ఉంది.
‘వాల్యూ చైన్’.. ఇక్కడే పరిశ్రమలు..
గతంలోలా ఖనిజాలను వెలికితీసి ముడిసరుకుగా తరలించడమే కాకుండా, ఇక్కడే శుద్ధి చేసేలా పరిశ్రమలు రాబోతున్నాయి. కేంద్రం ప్రకటించిన ‘రేర్ ఎర్త్ కారిడార్’ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం ఇటీవల ఆదేశించారు. ఖనిజాల వెలికితీత (మైనింగ్)తో పాటు, వాటి ‘వాల్యూ చైన్’ (విలువ ఆధారిత) పరిశ్రమలను ఇక్కడే స్థాపించడం ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి లభించనుంది. రక్షణ పరికరాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, గ్రీన్ ఎనర్జీ పరికరాల తయారీలోనూ శ్రీకాకుళం జిల్లా కీలకం కానుంది.
కంటైనర్ హబ్‌గా సిక్కోలు
మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తుండటంతో కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎక్వి్‌పమెంట్ తయారీ యూనిట్లను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. పర్యావరణానికి హాని కలగకుండా, అధునాతన పద్ధతుల్లో ఖనిజాలను వెలికితీస్తూనే పారిశ్రామికంగా జిల్లాను అగ్రభాగాన నిలబెట్టాలన్న ప్రభుత్వ సంకల్పం.. వలసల జిల్లాలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’.. ఎందుకంత స్పెషల్?
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే.. భూమి పొరల్లో చాలా అరుదుగా, చాలా తక్కువ మోతాదులో లభించే 17 రకాల రసాయన మూలకాల సమూహం. ఇవి అయస్కాంత శక్తిని, విపరీతమైన వేడిని తట్టుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆధునిక సాంకేతికతకు, ఎలకా్ట్రనిక్ పరికరాలకు అత్యంత కీలకం. సెల్‌ఫోన్ల చిప్స్, బ్యాటరీలు, శాటిలైట్లు, క్షిపణులు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇవి లేనిదే పని జరగదు. వీటి వెలికితీత, శుద్ధి క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ... అంతర్జాతీయ మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. క్లీన్ ఎనర్జీ, ఎలకా్ట్రనిక్ రంగాల్లో డిమాండ్ కారణంగా 2040 నాటికి వీటి అవసరం 300 నుంచి 700 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.