జీఎస్టీ అధికారులమంటూ వచ్చి దోచేశారు
ABN , Publish Date - May 03 , 2026 | 05:28 AM
జీఎస్టీ అధికారులమంటూ వచ్చి బంగారం షాపులో దోపిడీకి పాల్పడిన కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
బంగారం షాపు దోపిడీ కేసులో ఐదుగురి అరెస్టు
రెండు పిస్టళ్లు, నాలుగు కార్లు, రూ.49 లక్షల సొత్తు స్వాధీనం
శ్రీకాకుళం క్రైం, మే 2(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ అధికారులమంటూ వచ్చి బంగారం షాపులో దోపిడీకి పాల్పడిన కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు పిస్టళ్లు, నాలుగు కార్లు, 12 మొబైల్ ఫోన్లు, రూ.49 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శనివారం మీడియా సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. కాశీబుగ్గలోని నిత్యానందనగర్‌లో ఉన్న శ్రీవెంకటేశ్వర జ్యూయలరీ షాపులోకి ఏప్రిల్ 7న మధ్యాహ్నం 12 గంటల సమయంలో జీఎస్టీ అధికారులమంటూ ఏడుగురు వ్యక్తులు ప్రవేశించారు. వీరంతా నెంబర్ ప్లేట్లు లేని మూడు బైక్‌లపై వచ్చారు. షాపులో యజమాని కిల్లంశెట్టి రామకృష్ణారావు ఒక్కరే ఉండటంతో ఆయనను చుట్టుముట్టి చేతులకు బేడీలు వేశారు. పిస్టల్‌తో బెదిరించి షాపులో ఉన్న 800 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంతర్రాష్ట్ర ముఠా పనిగా భావించి, ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలుగా రంగంలోకి దిగారు.
సీసీ టీవీ ఫుటేజీల్లో లభ్యమైన బైక్‌ల ఫొటోల ఆధారంగా ఫైనాన్స్ సంస్థల నుంచి వివరాలు సేకరించారు. పాత నేరస్థుల పనేనని నిర్ధారణకు వచ్చారు. గాలించి, మాటువేసి ఒడిశా సరిహద్దులోని లొట్టూరు వద్ద ఒడిశాకు చెందిన రామచంద్రసాహు అలియాస్ బాబు, కునా బరిక్, బనోజ్ బిహారి పట్నాయక్, తపన్ మహారాణా, కాశీబుగ్గకు చెందిన పొట్నూరు తిరుమల పాత్రో అలియాస్ హరిలను అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఇంకా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది. పట్టుబడిన వారి నుంచి 243 గ్రాముల బంగారంతోపాటు రెండు పిస్టల్స్, రూ.3,41,000 నగదు, దోపిడీ చేసిన సొత్తుతో కొనుగోలు చేసిన రెండు కార్లు, నేరం చేయడానికి ముందుగా కొనుగోలు చేసిన రెండు కార్లు, 12 మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ రూ.49 లక్షలుగా పేర్కొన్నారు. ఈ ముఠాపై ఒడిశాలో 32 కేసులు ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.