Share News

తమ్మినేని భూ కబ్జా

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:59 AM

గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. స్పీకర్‌గా పనిచేసిన వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల రూపాయల విలువ చేసే....

తమ్మినేని భూ కబ్జా

  • దొంగ పత్రాలతో భూమి స్వాహా!

  • 2023లో కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్‌

  • సీతారాం, భార్య, కుమారుడిపై కేసు

  • యజమాని ఉన్నా ఫేక్‌ డెత్‌ సర్టిఫికెట్‌

  • తప్పుడు వారసత్వ పత్రాల సృష్టి

  • బాధితుడి ఫిర్యాదుతో 13 మందిపై కేసు

  • సహకరించిన సబ్‌ రిజిస్ట్రార్‌పైనా నమోదు

శ్రీకాకుళం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. స్పీకర్‌గా పనిచేసిన వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేశారు. భూ యజమాని బతికుండగానే చనిపోయినట్టుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. నకిలీ వారసులను చూపి తప్పుడు పత్రాలతో తమ్మినేని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్‌ వంత పాడారు. ఇదంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఆయన స్పీకర్‌గా ఉన్నప్పుడే జరిగింది. ఇటీవల బాధితుడి ఫిర్యాదుతో కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో తమ్మినేని సీతారాం (ఏ6)తో పాటు ఆయన భార్య తమ్మినేని వాణి (ఏ7), కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌ (ఏ5)పై కేసు నమోదు చేశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 8 మందిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. నిందితుల నుంచి నకిలీ రబ్బరు స్టాంపులు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తమ్మినేని కుటుంబ సభ్యులతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు. తమ్మినేని సీతారాం, తమ్మినేని వాణి, తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌ (నాని), ఏ13 బొడ్డేపల్లి అరుణ (ప్రస్తుత హిరమండలం సబ్‌ రిజిస్ట్రార్‌), ఏ4 త్రినాథ్‌ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

ఏం జరిగిందంటే...

ఎస్పీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్‌ పరిధిలోని చాపురం గ్రామ పంచాయతీ బలగ పరిధిలో సర్వే నంబర్‌ 35/13లో ఉన్న 84, 85, 86 ప్లాట్లను (900 గజాల స్థలం) అంధవరపు గోవిందరాజులు అనే వ్యక్తి నుంచి కట్టా కనకలింగేశ్వరరావు అనే వ్యక్తి 1988, 1992లో రెండు దఫాలుగా కొనుగోలు చేశారు. లింగేశ్వరరావు కుటుంబం ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆ స్థలం చాలా కాలంగా ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం ఆ స్థలం విలువ రూ.3-4 కోట్లు ఉంటుంది. ఆ ఖాళీ స్థలంపై నిందితుల కన్ను పడింది. కనక లింగేశ్వరరావుకు భూమిని విక్రయించిన అంధవరపు గోవిందరాజుల లింక్‌ డాక్యుమెంట్‌లను పైకి తీశారు. గోవిందరాజులు బతికి ఉండగానే.. ఆయన చనిపోయినట్లు తప్పుడు మరణ ఽద్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. వాస్తవానికి గోవిందరాజులుకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఒడిశాలోని జయపుర్‌ ప్రాంతానికి చెందిన అడబాల రజనిని తెరపైకి తెచ్చారు. ‘ఎ.రజని’గా రికార్డుల్లో చూపించి గోవిందరాజులకు ఏకైక వారసురాలుగా రెవెన్యూ అధికారుల నుంచి వారసత్వ ఽద్రువీకరణ (ఫ్యామిలీ మెంబర్‌) పత్రాన్ని తయారు చేయించారు. వీటితో తప్పుడు రిజిస్ట్రేషన్‌ పత్రాలను రూపొందించారు. ఆమదాలవలస సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌కు విక్రయించినట్లు రిజిస్ట్రేషన్‌ చేయించారు. తమ్మినేని సీతారాంకు చెందిన ఆమదాలవలసలోని ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్న నలుగురు లెక్చరర్లను ఇందుకు సాక్షులుగా సంతకం చేయించారు. ఇదంతా 2023లో జరిగింది. ఇటీవల ఆ స్థలానికి ప్రహరీ నిర్మించేందుకు యత్నించగా.. అసలు యజమాని కనకలింగేశ్వరరావు కుమారుడు కట్టా జైకిశోర్‌ పోలీసులను ఆశ్రయించారు. తమ వద్ద ఉన్న ఒరిజనల్‌ పత్రాలను పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి అసలు గుట్టు రట్టు చేశారు.


తమ్మినేని ఫ్యామిలీ స్కెచ్‌

భూ కబ్జా బాగోతం వెనుక మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణి, కుమారుడు తమ్మినేని చిరంజీవినాగ్‌(నాని) హస్తం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. అడబాల రజని(ఏ1), తెలుగు సతీశ్‌ కుమార్‌(ఏ2), లక్ష్మణరావు(ఏ3), త్రినాథ్‌(ఏ4)లు తమ్మినేని కుటుంబ సభ్యుల సహకారంతో డాక్యుమెంట్‌ రైటర్‌ కూన పెద్దిరాజు ద్వారా తప్పుడు పత్రాలను సృష్టించినట్లు నిర్ధారణైంది. ఈ వ్యవహారంలో అడబాల రజనికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చినట్టు తెలిసింది. సరిపల్లి లక్ష్మణరావు.. దాదాపు 70 డాక్యుమెంట్లకు సాక్షి సంతకాలు పెట్టినట్లు తెలిసింది. వీటన్నింటికీ అప్పుడు ఆమదాలవలసలో పనిచేస్తున్న హిరమండలం ప్రస్తుత సబ్‌ రిజిస్ట్రార్‌ (ఏ13) బొడ్డేపల్లి అరుణ వంతపాడారు. నిందితులకు సహకరిస్తూ సదరు ఆస్తికి తప్పుడు రిజిస్ట్రేషన్‌ జరిగేలా చేశారని దర్యాప్తులో తేలింది.

అరెస్టైన నిందితులు వీళ్లే..

ఏ1 అడబాల రజని, ఏ2 తెలుగు సతీశ్‌ కుమార్‌, ఏ3 సాలిపల్లి లక్ష్మణరావు, ఏ8 ముదాడ్ల ఉపేంద్ర కుమార్‌, ఏ9 జెగురిపాటి ఉపేంద్రరావు, ఏ10 మామిడి గోపాలకృష్ణ, ఏ11 సాంబాన సాంబశివరావు, ఏ12 కూన పెద్దిరాజు (డాక్యుమెంట్‌ రైటర్‌).

అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

భూ కబ్జా వ్యవహారం గుట్టు రట్టు చేసిన పోలీసులను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. భూములు కొనుగోలు చేసేటపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూ రికార్డులు, యాజమాన్య, వారసత్వ పత్రాలను, రిజిస్ట్రేషన్‌ వివరాలను ప్రభుత్వ శాఖల ద్వారా తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలన్నారు. రూ.5 లక్షలకు మించిన భూ లావాదేవీలను పాన్‌ కార్డు వివరాలతోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, నకిలీ పత్రాలతో భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jul 20 , 2026 | 03:59 AM