శ్రీకాకుళం, కుప్పం ఎయిర్‌పోర్టులకు వేగంగా అడుగులు
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:31 AM
శ్రీకాకుళం, కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వీటి నిర్మాణంపై ఈనెల 25న ఢిల్లీలో జరిగే భేటీలో కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ తుది నిర్ణయం తీసుకోనుంది.
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం, కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వీటి నిర్మాణంపై ఈనెల 25న ఢిల్లీలో జరిగే భేటీలో కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ బృందం హాజరవుతోంది. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లో 1,270.50 ఎకరాల పట్టాభూమి, 117.27 ఎకరాల డి-పట్టా భూమి, 254.53 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఎంపిక చేశారు. మందస మండలంలోని బిద్మి, బేతాళపురం, లక్ష్మీపురం, వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి, మెట్టూరులో భూ సేకరణకు రాష్ట్ర విమానాశ్రయాభివృద్ధి సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ భూసేకరణకు 246 కోట్ల వ్యయం అవుతుందని ఏపీఏడీసీఎల్ అంచనా వేసింది. అదేవిధంగా కుప్పం విమానాశ్రయం కోసం 1,848 ఎకరాలను సేకరించాలని ఏపీఏడీసీఎల్ నిర్ణయించింది. ఈ రెండు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకూ భూములు గుర్తించడంతో నిర్మాణానికి ఆమోదం తెలపాలంటూ కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. అనువైన భూమిని గుర్తించినందున కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.