Share News

బీమా సొమ్ము కోసం భారీ స్కెచ్‌!

ABN , Publish Date - Jul 05 , 2026 | 04:17 AM

మరణం అంచుకు చేరినవారిని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారిని చూస్తే జాలి కలుగుతుంది. స్తోమత ఉంటే జేబులోంచి తీసి వారి కోసం ఖర్చు పెట్టాలని కూడా అనిపిస్తుంది.

బీమా సొమ్ము కోసం భారీ స్కెచ్‌!

  • 5 కోట్ల మేర స్వాహా చేసిన వైసీపీ నేత

  • ఆమదాలవలసలో ఇన్సూరెన్స్‌ లీలలు

  • క్యాన్సర్‌, కిడ్నీ రోగులే ఆ నేత లక్ష్యం..

  • చివరకు తల్లినీ, భార్యనూ వదలని వైనం

  • వారి పేరిటా పాలసీలతో కోట్లలో క్లెయిమ్‌

  • బంధువుతో కలిసి బీమా సంస్థలకు టోకరా

  • పోలీసుల అండ.. బీమా ఏజెంట్లతో డీల్‌

  • 58 పాలసీలు తిరస్కరించిన ప్రైవేటు సంస్థలు

  • ఉన్నతాధికారులకు టీడీపీ నేత ఫిర్యాదు

  • సీబీఐతో దర్యాప్తునకు డిమాండ్‌

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

మరణం అంచుకు చేరినవారిని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారిని చూస్తే జాలి కలుగుతుంది. స్తోమత ఉంటే జేబులోంచి తీసి వారి కోసం ఖర్చు పెట్టాలని కూడా అనిపిస్తుంది. కానీ, వైసీపీకి చెందిన ఆ జడ్పీటీసీకి మాత్రం అలాంటి అభాగ్యులే ఆస్తి. వారిపై సొమ్ములు చేసుకొని ఆయన బతికేస్తున్నారు. దాదాపు 5 కోట్ల రూపాయల బీమా సొమ్మును పక్కా ప్రణాళికతో స్వాహా చేసేశారు. స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు పకడ్బందీ ఆధారాలతో సీఎం, సీఐడీ, ఎస్పీతో పాటు ప్రైవేటు బ్యాంకులు, ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)కు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. ఆ వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన వైసీపీ జడ్పీటీసీకి బీమా సంస్థలను బురిడీ కొట్టించి కోట్లు కొట్టేయాలన్న దురాశ కలిగింది. ఇందులో భాగంగా ఆయన కనీస ఆర్థిక స్తోమత లేనివారి పేరుతో, వారికి తెలపకుండానే ప్రైవేటు ఇన్సూరెన్స్‌ సంస్థల్లో తానే భారీ మొత్తాన్ని చెల్లించి పాలసీలు తీసుకున్నారు. పాలసీలకు నామినీగా తన కుటుంబ సభ్యులను లేక పాలసీదారుల కుటుంబసభ్యులను నమోదు చేయించారు. ఫోన్‌ నంబర్లను మాత్రం తనదీ, తన సమీప బంధువుదీ ఇచ్చారు. అవసరమైన ధ్రువపత్రాలు అన్నీ సిద్ధం చేసి, దానికి అయ్యే ఖర్చులు తానే భరించి.. పాలసీదారుల మరణాంతరం బీమా సొమ్ములను నేరుగా, లేదంటే వేరే పద్ధతుల్లో ఆయన సొంతం చేసుకునేవారు. ఈ తంతు నడిపేందుకు కొంతమంది ప్రైవేటు సంస్థల ఏజెంట్లను మంచి చేసుకున్నారు. తద్వారా పాలసీ నమోదు నుంచి ఆమోదం, క్లయిమ్‌ వరకు.. ఇబ్బందులు లేకుండా ఆ నేత చూసుకున్నారు.


తల్లి వయసు మార్చి..భార్య రోగం దాచి..

జడ్పీటీసీ అక్రమాలు సొంత ఇంటి నుంచే మొదలయ్యాయి. ఆయన తల్లికి 85 సంవత్సరాలు. అయితే, తల్లి వయస్సును ఆధార్‌లో తగ్గించేసి పలు ప్రైవేటు ఇన్సూరెన్స్‌ పాలసీలను ఆ నేత చేయించారు. ఆమె కొన్నాళ్ల తర్వాత మరణించడంతో నామినీగా ఉన్న జడ్పీటీసీకి ఏకంగా రూ.కోటిన్నర వరకు బీమా సొమ్ము లభించింది. అలాగే ఆయన భార్య 47 ఏళ్ల వయస్సులో క్యాన్సర్‌కు గురయింది. ఈ జబ్బును దాచిపెట్టి బీమా చేయించి, ఆమె పేరిట పాలసీ తీసుకుని నామినీగా తానే ఉన్నారు. భార్య మరణాంతరం బీమా సొమ్మును రూ.కోటి వరకు వివిధ ఇన్సూరెన్స్‌ సంస్థల నుంచి అందుకున్నారు. తన మనుషులతో ఇన్సూరెన్స్‌ సిబ్బందిని మేనేజ్‌ చేయించి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఈయనకు తోడుగా జడ్పీటీసీ సమీప బంధువు నిలిచారు. ఆయన కూడా 75 ఏళ్ల వయసున్న తన తల్లి పేరుమీద పాలసీ చేశారు. కానీ అప్పటికే విషయం బయటకు పొక్కడంతో ఆ పాలసీని ప్రైవేటు సంస్థ వెనక్కి తిప్పి పంపింది.


అమాయకులే టార్గెట్‌..

ఆమదాలవలసకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి క్యాన్సర్‌తో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుని, అతని పేరుతో సదరు నేత భారీగా ఇన్సూరెన్స్‌ చెల్లించారు. పాలసీ దారు మరణించాక భార్య నామినీగా రికార్డులో ఉండటంతో ఆమెకు కేవలం రూ.3 లక్షల వరకు ముట్టజెప్పి, మిగిలిన సొమ్మును (సుమారు రూ.70 లక్షలు) ఆయన కాజేశారు. ఆమెకు విషయం తెలిసినా గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి. తన బాధ ఒకరి వద్ద వెళ్లబోసుకోగా, అదిప్పుడు వీడియో రూపంలో బయటకువచ్చింది. ఇదే ప్రాంతానికి చెందిన, ఆర్థిక స్తోమత లేని ఓ వ్యక్తికి బీమా చేయించారు. పాలసీదారు 2021 ఏప్రిల్‌ నెలలో మరణించగా, ఆగస్టులో మరణించినట్లు అప్పట్లో వైసీపీ నాయకులు, అధికారుల అండతో ధ్రువపత్రాలు రూపొందించారు. పాలసీదారు అన్నను నామినీగా రికార్డుల్లో చూపించారుగానీ, ఒక్క పైసా కూడా అన్నకు ఇవ్వలేదు. ఇల్లు కట్టిస్తామని చెప్పి అదికూడా చేయలేదని ఆ నామినీ చెబుతున్న వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. గాజులకొల్లివలస ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల మహిళ పేరుతో వివిధ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఆ నేత బంధువు పాలసీలు చేశారు. తానే నామినీగా ఉన్నారు. తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి, ఆమె మరణానంతరం పలు సంస్థల నుంచి బీమా సొమ్మును ఏకంగా రూ.కోటికి పైగా అందుకున్నారు. ఉద్దానం ఏరియాలో కిడ్నీ జబ్బులతో పోరాడుతున్నవారితో మాట్లాడి వారి పేరునా ఆ బంధువు బీమాలు చేయించారు.


కప్పి పుచ్చిన పోలీసులు..

ఏకంగా 10 క్రిమినల్‌ కేసులు ఉన్న జడ్పీటీసీ నిర్వాకంపై మరిన్ని ఆధారాలు సేకరించాలని సీఐ, ఎస్‌ఐలకు ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ఇద్దరు అధికారులు ఇన్సూరెన్స్‌ అక్రమాలను బయటకు రానీయకుండా మరింత కాపు కాశారు. ఈ సమాచారం ఉన్నతాధికారులకు తెలిసిపోయింది. దీంతో వారిద్దరిపై త్వరలో వేటు పడొచ్చునని సమాచారం. మరోవైపు, ప్రైవేటు బ్యాంకులు, అవి నడుపుతున్న ఇన్సూరెన్స్‌ స్కీములపైనా యాజమాన్యాలకు ఫిర్యాదులు అందటంతో అంతర్గతంగా ఆయా సంస్థలు విచారణ నిర్వహించాయి. జడ్పీటీసీకి సహకరించి కోట్ల రూపాయల క్లెయిం చెల్లింపులకు కారణమైన ఏజెంట్లను, సిబ్బందిని గుట్టుచప్పుడు కాకుండా తప్పించేశాయి. అప్పటికే క్లెయిం చెల్లించేసిన వాటి విషయంలో పత్రాలను లీగల్‌గా తమవద్ద ఉంచుకుని, అసంబద్ధంగా ఉన్న 58 పాలసీలను అవి రిటర్న్‌ చేశాయి. మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులకు టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేశారు. తొమ్మిది ప్రముఖ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో గత ఐదేళ్ల కాలంలో చెల్లించిన క్లెయింల వివరాల ఆధారంగా లోతుగా దర్యాప్తు జరపాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు.

Updated Date - Jul 05 , 2026 | 04:20 AM