అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.కోటితో పరార్
ABN , Publish Date - Mar 09 , 2026 | 05:10 AM
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.కోటి వరకు డిపాజిట్లు సేకరించి ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు.
రణస్థలం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.కోటి వరకు డిపాజిట్లు సేకరించి ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. రణస్థలం మండలం కోష్ట జంక్షన్‌లో ఆరు నెలల కిందట ఓ ఇద్దరు వ్యక్తులు కార్యాలయాన్ని తెరిచారు. రూ.లక్ష కడితే ప్రతి నెలా రూ.12 వేలు చొప్పున వడ్డీ ఇస్తానని నమ్మబలికారు. రణస్థలం, పోలాకి మండలాలతోపాటు.. విజయనగరం పూసపాటిరేగ, విశాఖ మత్స్యకార ప్రాంతాల్లో చాలా మంది నుంచి సుమారు రూ.కోటికిపైగా డిపాజిట్లు సేకరించారు. ప్రారంభంలో ఒకటి రెండుసార్లు డిపాజిట్‌దారులకు బాగానే డబ్బులు చెల్లించారు. తర్వాత డబ్బులు చెల్లింపు ఆలస్యం చేశారు. దీంతో కొంతమంది బాధితులు ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారు. ప్రస్తుతం వారిద్దరి ఆచూకీ లేదు. కార్యాలయం తెరవడం లేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు ఇటీవల జేఆర్‌పురం పోలీసులను ఆశ్రయించి.. జరిగిన మోసాన్ని వివరించారు. దీనిపై పరిశీలించి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.