పకడ్బందీగా డయేరియా కట్టడి
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:05 AM
శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియాను అదుపు చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 102 కేసులు.. ఆస్పత్రుల్లో 85 మందికి చికిత్స
శ్రీకాకుళం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియాను అదుపు చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన హుటాహుటిన శ్రీకాకుళం చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కిమ్స్ తదితర ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించి, అందుతున్న వైద్యసదుపాయాలపై ఆరా తీశారు. శ్రీకాకుళం నగరంలో ఇప్పటి వరకు 102 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ‘ఇప్పటికే 13మంది కోలుకుని డిశార్చి అయ్యారు. 85మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి కాస్త అందోళనకరంగా ఉండటంతో డయాలసిస్ అందిస్తున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు. వ్యాధి ప్రబలడానికి గల కారణాలను విశ్లేషించేందుకు పబ్లిక్ హెల్త్ ఈఎన్సీని రప్పించామని వెల్లడించారు. ప్రాథమిక నీటి పరీక్షల్లో కాలుష్యం అనవాళ్లు ఏమీ బయటపడలేదని తెలిపారు. డయేరియా వల్ల ఒకరు మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై నారాయణ స్పష్టత ఇచ్చారు. ‘ఒక వ్యక్తి ఇంట్లో మరణించారు. అది డయేరియా వల్లే జరిగిందా అన్నది అనుమానం. ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. టిష్యూలను కూడా కల్చర్ టెస్టుకు పంపాం. ఆ రిపోర్టులు వచ్చాకే అధికారికంగా ప్రకటిస్తాం’ అని ఆయన తేల్చిచెప్పారు. కాగా, శ్రీకాకుళంలో డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తాగునీటికి రూ.60 కోట్లు, డ్రైనేజీ కాలువ ఆధునికీకరణకు రూ.35 కోట్లు, మురుగునీటి శుద్ధి కోసం రూ.23 కోట్లు కేటాయించామని నారాయణ తెలిపారు.
శ్రీకాకుళం కమిషనర్ సస్పెన్షన్: శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా (గ్యాస్ట్రో ఎంటరైటిస్) కేసులు ప్రబలడం, ఒకరు ప్రాణాలు కోల్పోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన కార్పొరేషన్ కమిషనర్ హెచ్.కూర్మారావుపై సస్పెన్షన్ వేటు వేసింది.