గ్రాఫిక్ ఫొటోలతో సీఎంపై దాడి కేసులో.. వైసీపీ సోషల్‌మీడియా చీఫ్ శ్రీహరి అరెస్టు
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:13 AM
సీఎం చంద్రబాబు ఫొటోలను పదేపదే మార్ఫింగ్ చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న వైసీపీకి పోలీసులు షాకిచ్చారు.
చంద్రబాబు చేతితో కత్తిపెట్టి దుష్ప్రచారం
కుప్పంలో కేసు.. తాడేపల్లిలో అదుపులోకి..
చిత్తూరు జిల్లాకు పూడి శ్రీహరి తరలింపు
అమరావతి, తాడేపల్లి టౌన్, కుప్పం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఫొటోలను పదేపదే మార్ఫింగ్ చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న వైసీపీకి పోలీసులు షాకిచ్చారు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి గ్రాఫిక్ ఫొటోలతో దుష్ప్రచారం సాగించిన వ్యవహారంలో మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వో, వైసీపీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని బుధవారం అరెస్టు చేశారు. ఇదే కేసులో అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి గిరీశ్ కుమార్‌రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు గ్రాఫిక్ ఫొటోతో విష ప్రచారం చేసినట్టు శ్రీహరిపై చిత్తూరు జిల్లాలో కేసు నమోదయింది. ‘‘అధికారం కోసం హత్యా రాజకీయాలు చేయడం.. ఆ పాపాన్ని ఎదుటివారికి అంటగట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం దశాబ్దాలుగా చంద్రబాబుకి బాగా అలవాటైన విద్య. నారా హంతకుడు సీబీఎన్. హిట్లర్ చంద్రబాబు. హత్యలు చేసేదీ.. నిందలు వేసేదీ.. చంద్రబాబే. బాబు కెరీర్ మొత్తం హత్య రాజకీయాలే. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా ఎదిగాడు. మల్లెల బాబ్జి అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం ఉంది. రంగా, పింగళి దశరథ రామ్ హత్యల్లోనూ బాబు పాత్ర ఉంది. బాబు హయాంలో వైఎస్ రాజారెడ్డి హత్య జరిగింది.
ఆ కేసులో హంతకులకు ఆయన హైదరాబాద్‌లో షెల్టర్ ఇచ్చారు..’’ అంటూ గ్రాఫిక్స్ డిజైన్ చేసి సామాజిక ఉద్రిక్తతలు పెంచేలా వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. దీనిపై కుప్పం ఐ-టీడీపీ నేత, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ వినోద్ కుమార్ మూర్తి అక్కడి అర్బన్ పోలీసు స్టేషన్లో ఈ నెల 13న ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాడేపల్లిలో శ్రీహరిని, అనంతపురంలో గిరీశ్‌ను అరెస్టు చేసి చిత్తూరుకు తరలించారు. శ్రీహరి ఉదయం 8 గంటల సమయంలో జగన్ ఇంటి నుంచి తాడేపల్లి నవోదయ కాలనీలోని తన ఇంటికి వెళుతుండగా చిత్తూరు టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన సెల్ ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరి నివాసంలో 2 గంటలు సోదాలు జరిపి కంప్యూటర్ పరికరాలు, పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. గిరీశ్ రెడ్డిని కుప్పం కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి రిమాండ్‌ను తిరస్కరించి, 41ఏ నోటీసు ఇచ్చి పంపించాలని ఆదేశించారు. పూడి శ్రీహరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
బాబు టార్గెట్‌గా..
రాజకీయ స్వార్థంతో కుట్రలు చేసే వైసీపీ పదే పదే చంద్రబాబుపై మార్ఫింగ్ ఫోటోలతో విషం చిమ్ముతోంది. ఏడేళ్ల క్రితం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్యను జగన్ మీడియా వక్రీకరించింది. ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి గ్రాఫిక్ ఫోటోలతో పెద్ద వార్త ప్రచురించింది. 2024 ఎన్నికల సమయంలో గులకరాయి డ్రామాకు తెరతీశారు.
శ్రీహరి కోసం..హెబియస్ కార్పస్ పిటిషన్
పూడి శ్రీహరిని కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన డ్రైవర్ పోతల సింహాచలంనాయుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను లంచ్‌మోషన్‌గా స్వీకరించి, అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి బుధవారం ధర్మాసనాన్ని అభ్యర్ధించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ మెడమల్లి బాలాజీతో కూడిన ధర్మాసనం.. వ్యాజ్యంపై గురువారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.