శ్రీవాణి ట్రస్టు నిబంధనలు సడలింపు
ABN , Publish Date - Mar 10 , 2026 | 05:15 AM
శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆలయాలకు అందించే ఆర్థిక సహాయ విషయంలో ప్రస్తుతమున్న మార్గదర్శకాల వల్ల ఎక్కువ మేలు జరగట్లేదని భావించిన టీటీడీ పాలక మండలి నిబంధనలు...
మార్గదర్శకాల మార్పుతో మరిన్ని ఆలయాలకు ఆర్థిక సహాయం
భజన మందిరం పథకం ద్వారా ఆలయాల నిర్మాణానికి ప్రాఽధాన్యం
ట్రస్టు ద్వారా ధూపదీప నైవేద్యం, అర్చకులు ఆచారాలపై శిక్షణ
తిరుపతి(టీటీడీ), మార్చి 9(ఆంధ్రజ్యోతి): శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆలయాలకు అందించే ఆర్థిక సహాయ విషయంలో ప్రస్తుతమున్న మార్గదర్శకాల వల్ల ఎక్కువ మేలు జరగట్లేదని భావించిన టీటీడీ పాలక మండలి నిబంధనలు సరళతరం చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. గతంలో కేవలం గర్భాలయం, ముఖమండపం/మహామండపం పనుల నిర్మాణాలకు మాత్రమే నిధులు విడుదల చేస్తూ వచ్చారు. ఈ నిబంధనలు సరళతరం చేసి మరిన్ని ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు అనుగుణంగా టీటీడీ పాలకమండలి తిరుపతి జేఈవో, చీఫ్ ఇంజనీర్, ఎఫ్‌ఏ అండ్ సీఏవోతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికకు టీటీడీ పాలకమండలి ఇటీవల ఆమోదం తెలిపింది. కొత్తగా అమల్లోకి తీసుకువస్తున్న నిబంధనల కారణంగా పూర్తిస్థాయిలో ఆలయాలు నిర్మించడంతోపాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ట్రస్టు నిధులు ఖర్చు చేయనున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఆలయాలకు భక్తుల సంఖ్య పెరగడం ద్వారా ఆయా ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుంది.
కొత్త మార్గదర్శకాలు ఇవే..
శ్రీవాణి ట్రస్టు ద్వారా కేవలం ఆంధ్రప్రదేశ్ చారిటబుల్, హిందూ ధార్మిక సంస్థలు, దేవదాయ శాఖ చట్టం పరిధిలోని ఆలయాలకు మాత్రమే నిధులు కేటాయిస్తారు. కొత్త ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణతో పాటు ప్రస్తు తం ఉన్న ఆలయాలను పునర్నిర్మించవచ్చు. ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి మధ్యలో నిలిచిపోయిన దేవాలయాలకు నిధులు కేటాయిస్తారు. దేవదాయ శాఖ ద్వారా ‘ఎ’ విభాగంలో నోటిఫై చేసిన ఆలయాలకు నిధులు ఇవ్వరు.
ఆలయాల్లో ప్రాకారం, గర్భాలయం, ముఖమండపం, మహామండపం, ఆలయ ముఖద్వారం, గోపురాలు, ఆర్కియాలజీ/మతపరమైన ప్రాముఖ్యం ఉన్న నిర్మాణాలకు ఆమోదం.
భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనకు ట్రస్టు నుంచి నిధులు కేటాయిస్తారు.
ఆలయాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, బయో డైజస్టర్ యూనిట్ల ఏర్పాటు. టీటీడీ నిర్వహణలోని ఆలయాల్లో పనులు అవసరమైన మేరకు చేపట్టనున్నారు.
హిందూ ధర్మప్రచారంలో భాగంగా రాతి విగ్రహాలు, పీఎల్‌వీలు, మైక్‌సెట్లు, గొడుగులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం/హెడ్‌డీడీపీ కమిటీ/టీటీడీ పాలకమండలి ఆమోదించిన పలు కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తారు. అయితే వీటికి మొత్తం మంజూరైన పనుల్లో 10 శాతం లేదా శ్రీవాణి ట్రస్టు ద్వారా మంజూరైన నిధుల్లో 10 శాతం ఏది తక్కువ అయితే అంతమేర సహాయంగా అందజేయనున్నారు.
భజన మందిరం పథకం ద్వారా ఆలయాల నిర్మాణానికి ప్రాఽధాన్యం. ఇందులో అణగారిన వర్గాల ప్రజలు నివసించే గ్రామాలు, కాలనీలు, బడుగు బలహీనవర్గాలు నివసించే ప్రాంతాల్లో నిర్మాణానికి నిధులు ఇవ్వనున్నారు. ఖర్చు, సమయానికి నిర్మాణాలు పూర్తయ్యేందుకు వీలుగా ఒకే నమూనాలో ఆలయాలు నిర్మించనున్నారు. ఇటువంటి ఆలయాలకు ప్రజల సహకారం అవసరం లేదు. అయితే టీటీడీ నమూనాలో కాకుండా పెద్ద ఆలయాలు నిర్మించాలని అనుకునే ప్రాంతాల్లో మాత్రం ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.
ట్రస్టు ద్వారా రూ.2 కోట్ల వరకు సహాయం అందించనున్నారు. ఈ స్థాయిలో నిర్మాణం చేపట్టే ఆలయాలకు ప్రజల నుంచి 25 శాతం సహకారం తప్పనిసరి. ట్రస్టు ద్వారా చేపట్టే పనులన్నీ కూడా దేవదాయ శాఖ ద్వారా చేపట్టనున్నారు.
ట్రస్టు ద్వారా ధూపదీప నైవేద్యం, అర్చకులు ఆచారాలపై శిక్షణ కార్యక్రమాలు, ఆలయాల్లో వేద పండితులకు సంభావనలకు నిధులు ఇవ్వనున్నారు.
శ్రీవాణి ట్రస్టు ట్రస్టీలు ప్రతి పనికీ రూ.10 కోట్ల మేరకు మాత్రమే పరిపాలనపరమైన అనుమతి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ నిధులు టీటీడీ బోర్డు ద్వారానే పరిపాలనపరమైన అనుమతి పొందాలి. చేపట్టే పనులు, వాటి పురోగతిని అనుసరించి నిధులు విడుదల చేయనున్నారు.