నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:15 AM
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఈ నెల 18 వరకు నిర్వహించనున్నారు.
మహా శివరాత్రికి సుందరంగా ముస్తాబు
ఆర్జిత సేవలన్నీ తాత్కాలికంగా నిలిపివేత
భక్తులు వేచి ఉండేందుకు 20 కంపార్ట్‌మెంట్లు
39 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు
శ్రీశైలం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఈ నెల 18 వరకు నిర్వహించనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రతినిత్యం విశేషార్చనలు, ప్రత్యేక పూజలు, పలు వాహనసేవలతో గ్రామోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో ఎం.శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ తాత్కాలికంగా నిలిపివేశారు. వీఐపీలకు సైతం స్పర్శ దర్శనాలు నిలిపివేశారు. అలంకార దర్శన విధానాల్లో మార్పులు చేశారు. వీఐపీ విరామ దర్శనాలు మూడు స్లాట్లు, ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు నిరంతరం కొనసాగేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జ్యోతిర్ముడి సమర్పించే భక్తులకు మాత్రం ఆదివారం నుంచి ఈ నెల 12వరకు స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. భక్తులు వేచి ఉండేందుకు పూర్తి సదుపాయాలతో 20 కంపార్టుమెంట్లు సిద్ధం చేశారు. శివరాత్రికి ముందు 4రోజులపాటు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాల వితరణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాలను కలుపుతూ 39 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.12 కోట్లతో సదుపాయాలు కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
వాహన సేవలు ఇలా..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ నిర్వహిస్తారు. 9న భృంగి వాహన సేవ, 10న హంస వాహనం, 11న మయూర వాహనం, 12న రావణ వాహనం, 13న పుష్ప పల్లకీ సేవ, 14 గజవాహన సేవ నిర్వహించనున్నారు. 15(మహా శివరాత్రి రోజు)న ప్రభోత్సవం, నంది వాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ లీలాకల్యాణం, 16న రథోత్సవం, తెప్పోత్సవం, 17న యాగపూర్ణాహుతి, ధ్వజావరోహణ నిర్వహిస్తారు. 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ముఖ్యమంత్రికి ఆహ్వానం
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆలయ బోర్డు చైర్మన్ రమేశ్ నాయుడు, ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎంని కలిసిన వీరు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను సీఎంకి అందజేశారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సీఎంకి వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. మంత్రి లోకేశ్‌ను కూడా శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.