Share News

శ్రీశైల పాదయాత్రికులకు తీపికబురు

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:30 AM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాలినడకన శ్రీశైలం తరలివెళ్లే భక్తులకు అటవీశాఖ తీపికబురు చెప్పింది.

శ్రీశైల పాదయాత్రికులకు తీపికబురు

  • అటవీ మార్గంలో ప్రారంభమైన పాదయాత్ర

  • ముందస్తు అనుమతులపై భక్తుల హర్షం

ఆత్మకూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాలినడకన శ్రీశైలం తరలివెళ్లే భక్తులకు అటవీశాఖ తీపికబురు చెప్పింది. ఈ నెల 15 వరకు అటవీ మార్గం గుండా మల్లన్న క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన్స్‌- 2026లో భాగంగా నాగార్జునసాగర్‌- శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో జనవరి 3 నుంచి మే 31 వరకు మూడు దశల్లో పులుల లెక్కింపు చేపడుతున్నారు. తొలిదశలో భాగంగా ఈ నెల 10 వరకు మార్కాపురం, నంద్యాల, గిద్దలూరు, ఆత్మకూరు అటవీ డివిజన్ల పరిధిలోని పలు రేంజ్‌ల్లో ఫేజ్‌-3 కింద కెమెరా ట్రాప్స్‌ ఆధారంగా పులుల గణాంకాలను సేకరించనున్నారు. ఈ కారణంగా శ్రీశైలానికి నడిచి వెళ్లే భక్తులపై అటవీ శాఖ ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అటవీ మార్గంలో నడిచి వెళ్లేందుకు అవకాశం కల్పించింది. అయితే చాలామంది భక్తులు, శివదీక్షాపరులు అంతకంటే ముందుగానే వస్తుండటంపై అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిని ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి కర్నూలు- గుంటూరు జాతీయ రహదారి మీదుగా దోర్నాలకు వెళ్లి అక్కడినుంచి శ్రీశైలానికి వెళ్లాలని అధికారులు సూచించారు. ఇది ప్రయాసతో కూడిన ప్రయాణం కావడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 2న శ్రీశైలంలో జరిగిన మంత్రుల సమావేశంలో చర్చించారు. అనంతరం అటవీశాఖ ఉన్నతాధికారులు సమీక్షించి ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు అటవీ మార్గంలో నడిచి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో శుక్రవారం నుంచి పాదయాత్రికులు వెంకటాపురం నుంచి శ్రీశైలానికి బయలుదేరారు. అటవీశాఖ తీసుకున్న నిర్ణయంతో మల్లన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:31 AM