Share News

శ్రీశైలంలో శివదీక్షాధారుల ఆందోళన

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:11 AM

ఊహించని విధంగా శ్రీశైలంలో శివస్వాముల రద్దీ పెరిగింది. మండల దీక్ష పూర్తిచేసుకుని పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్న జ్యోతిర్ముడి శివస్వాములకు మల్లన్న స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించాలని దేవస్ధానం నిర్ణయించింది.

శ్రీశైలంలో శివదీక్షాధారుల ఆందోళన

  • అనూహ్యంగా రద్దీ

  • జ్యోతిర్ముడి స్వాములకు ఉచిత స్పర్శ దర్శనం

  • కొందరు మళ్లీమళ్లీ రావడంతో తోపులాట

  • సహనం కోల్పోయిన శివదీక్షాధారులు

  • బారికేడ్లు తోసి, తాళాలు పగులగొట్టి విధ్వంసం

శ్రీశైలం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఊహించని విధంగా శ్రీశైలంలో శివస్వాముల రద్దీ పెరిగింది. మండల దీక్ష పూర్తిచేసుకుని పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్న జ్యోతిర్ముడి శివస్వాములకు మల్లన్న స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించాలని దేవస్ధానం నిర్ణయించింది. అయితే రద్దీ కారణంగా స్వామివారి దర్శనం ఆలస్యం కావడంతో శివదీక్షాపరులు సహనం కోల్పోయి ఆందోళనకు దిగారు. సోమవారం శ్రీశైలానికి వేలాదిగా శివదీక్షాపరులు తరలివచ్చారు. జ్యోతిర్ముడి స్వాములకు సోమవారం తెల్లవారుజాము నుంచి రెండు గంటలకోసారి స్పర్శ దర్శనం కల్పించారు. శివస్వాములకు నాలుగు రోజులు మాత్రమే స్పర్శదర్శనం అవకాశం కల్పించడంతో శ్రీశైలానికి పోటెత్తారు. పాదయాత్రగా వచ్చి నేరుగా మొదటిసారి గర్భాలయ దర్శనం చేసుకున్న తరువాత జ్యోతిర్ముడిని సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది రెండోసారి కూడా స్పర్శ దర్శనం కోసం కంపార్టుమెంట్లు, క్యూలైన్లలో చొరబడటంతో సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయం నుంచి చంద్రావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు, కంచెలను శివభక్తులు పూర్తిగా ధ్వంసం చేసి గుంపులుగా ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభానికి ఇరువైపులా క్యూలైన్లలో నిండిపోయారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోగా, సహనం కోల్పోయిన కొందరు శివదీక్షాపరులు నినాదాలు చేస్తూ, గేట్లకు వేసిన తాళాలు పగులకొడుతూ అడ్డుకునేందుకు వచ్చిన ఆలయ అధికారులు, సిబ్బందితోపాటు సేవ చేస్తున్న శివసేవకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు, శివసేవకులు మైక్‌ ద్వారా చేస్తున్న సూచనలను లెక్క చేయలేదు. స్వామివారిని దర్శించుకునేందుకు బారికేడ్లు తోసుకుంటూ, ఆలయంలో ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను ధ్వంసం చేశారు. మరికొందరు భక్తులు వెంట తెచ్చుకున్న రాళ్లతో గేట్లకు వేసిన తాళాలను ధ్వంసం చేశారు.


దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్‌ రాజకుమారి పోలీసు భద్రతను పెంచారు. ఆలయ పరిసరాల్లోని క్యూలైన్లను పూర్తిగా ధ్వంసం చేసి, అధికారులపై తిరగబడుతున్న వారిని అదుపు చేసేందుకు నంద్యాల ఏఎస్పీ యుగంధర్‌బాబు కొందరు శివస్వాములపై లాఠీ ఎత్తి చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కొందరు శివస్వాములు అసభ్యపదజాలంతో దూషిస్తూ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడటం బాధాకరమన్నారు. కాగా.. రాత్రి 10 గంటలైనా శివదీక్షాధారులు ఆందోళన విరమించలేదు. ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు, పాలకమండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌ నాయుడు భక్తులకు సర్ది చెబుతున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. తమపై కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతూ కావాలనే కొందరు శివస్వాములు గొడవలు సృష్టిస్తూ ఆలయ ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్నారని ఈఓ ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు మౌలిక వసతులను కల్పిస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగపరుచుకోకుండా ఇలా ధ్వంసం చేయడం భాదాకరమన్నారు. మరోవైపు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 వేల మందికి పైగా జ్యోతిర్ముడి శివస్వాములు స్పర్శ దర్శనం చేసుకోగా, సామాన్య భక్తులు 30 వేల మందికి పైగా అలంకార దర్శనాలు చేసుకున్నారు. ప్రస్తుతం క్షేత్రంలో లక్ష మంది భక్తులు ఉన్నట్టు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.


స్పర్శ దర్శనానికి సహకరించండి: ఈఓ, చైర్మన్‌

జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, తమకు సహకరించాలని ఈఓ శ్రీనివాసరావు, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌ పోతుగుంట రమే్‌షనాయుడు శివభక్తులకు విజ్ఞప్తి చేశారు. శివస్వాములు అలజడులు సృష్టిస్తూ తోటి భక్తులకు అసౌకర్యంగా వ్యవహరించడం సరికాదని సూచించారు. 20 కంపార్టుమెంట్లతోపాటు చంద్రావతి కల్యాణ మండపంలో వేచి ఉండే భక్తులకు అవసరమైన మంచినీరు, మజ్జిగ, బిస్కెట్‌ ప్యాకెట్లు, అల్పాహారాలు నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు.

Updated Date - Feb 10 , 2026 | 04:11 AM