తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:27 AM
నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి ప్రయాణికులతో డోన్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సింగిల్ రోడ్డులో సడన్ బ్రేక్‌తో గుంతలోకి ఒరిగిన బస్సు
బస్సులో 55 మంది ప్రయాణికులు.. అంతా సురక్షితం
శ్రీశైలం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైలం నుంచి ప్రయాణికులతో డోన్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్, పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శిఖరేశ్వరం దోర్నాల ఘాట్ రోడ్డులోని.. చింతల ప్రాంతంలో సింగిల్ రోడ్డు, ఆపై మలుపులు ఉన్నాయి. ఈ క్రమంలో ముందు వెళ్తున్న వాహనం మరింత స్లోగా వెళ్తుండగా వెనుక బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో బస్సు రోడ్డు పక్కన గుంతలోకి పుర్తిగా ఒరిగిపోయింది. బస్సు ఎడమ వైపునకు ఒరిగిపోవడంతో డోరు మూసుకుపోయి ప్రయాణికులు బయటికి రాలేకపోయారు. దీంతో.. వారు కేకలు వేస్తూ కుడివైపు కిటికీల గుండా తోటి ప్రయాణికుల సాయంతో బయటికి వచ్చారు. డ్రైవర్‌కు, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉండగా, ప్రమాదం జరిగిన ప్రదేశంలో లోయ లేకపోవడం, రక్షణగోడ పక్కనే పెద్ద కొండ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.