లడ్డూ కల్తీ రాజకీయ అంశం కాదు
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:12 AM
తిరుమల కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్. కరుణాకర్...
శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అధ్యక్షుడు కరుణాకర్
హైదరాబాద్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుమల కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్. కరుణాకర్, హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు లలిత్ కుమార్ అన్నారు. లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనను రాజకీయ కోణంలో చూసి హిందువులు పార్టీల వారీగా విడిపోయి స్పందించకుండా మౌనంగా ఉండటం అత్యంత ఆందోళనకరమైన విషయమన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో వారు మాట్లాడారు. ‘తిరుమల లడ్డూ వ్యవహారం రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. హిందువుల మనోభావాలకు చెందినది. క్లీన్ చిట్ ఇవ్వాల్సింది జగన్ మీడియా కాదు, విచారణ సంస్థలు. నెయ్యి కల్తీలో బాధ్యులపై ప్రభు త్వం కఠిన చర్యలు తీసుకోవాలి. దోషులను అరెస్టు చేయాలి’ అని వారు డిమాండ్ చేశారు. హవాలా ద్వారా వేంకటేశ్వరస్వామి సొమ్మును దోచుకోవడం, కమీషన్ల కోసం స్వంత కంపెనీలకు టెండర్లు కేటాయించడం, చుక్క పాలు లేకుండా ప్రమాదకరమైన రసాయనాలతో నెయ్యి తయారు చేసి లక్షలాది మంది భక్తులు తినే లడ్డూల్లో కలపడం వంటి చర్యలు చట్టపరంగా ఎంత పెద్ద నేరమో అంతకన్నా మహాపాపం కూడా అని మండిపడ్డారు. రూ.250 కోట్ల కుంభకోణానికి పాల్పడిన వారిని ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.