Share News

అంచనాలతో కాలక్షేపం!

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:22 AM

సముద్ర తీర ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లు ఆనవాళ్లు లేకుండాపోయాయి. దీంతో తరచూ సముద్రపు నీరు పంట పొలాల్లోకి చొచ్చుకు వస్తోంది. దీంతో సుమారు పది వేల ఎకరాల భూములు సాగుకు దూరమయ్యాయి. పంటలు పండించుకునేందుకు అవకాశం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. వారు మాత్రం అంచనాల తయారీతోనే కాలక్షేపం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంచనాలతో కాలక్షేపం!

- ఐదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లు

- అంచనాల తయారీలోనే అధికారులు

- నిధుల మంజూరు.. పనుల ఊసేలేదు!

- పొలాల్లోకి చొచ్చుకువస్తున్న సముద్రపు నీరు

- పంటల సాగుకు దూరమైన పది వేల ఎకరాలు

- తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు

సముద్ర తీర ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లు ఆనవాళ్లు లేకుండాపోయాయి. దీంతో తరచూ సముద్రపు నీరు పంట పొలాల్లోకి చొచ్చుకు వస్తోంది. దీంతో సుమారు పది వేల ఎకరాల భూములు సాగుకు దూరమయ్యాయి. పంటలు పండించుకునేందుకు అవకాశం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. వారు మాత్రం అంచనాల తయారీతోనే కాలక్షేపం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

సముద్రపు పోటు సమయంలో ఉప్పునీరు డ్రెయిన్‌లలోకి చొచ్చుకురాకుండా, మిగిలిన సమయంలో డ్రెయిన్‌లలోని నీరు సముద్రంలో కలిసేలా తీర ప్రాంతంలోని అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన 14 అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు పూర్తిగా పాడైపోయాయి. వాటికి ఉన్న గేట్లు తుప్పుపట్టి నీటిలో కొట్టుకుపోయాయి. అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు పూర్తిగా పాడవడంతో కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం సౌత మండలాల్లో వరిసాగు చేసే పొలాల్లోకి ఉప్పునీరు ప్రవేశించి 10 వేల ఎకరాలకుపైగా సాగుకు దూరమైంది. పాడైపోయిన అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లకు గేట్లు బిగిస్తారా, లేక పూర్తిస్థాయిలో నిర్మాణం చేస్తారా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ల నిర్మాణం చేసేందుకు అంచనాలు తయారు చేయడం, పనులు ప్రారంభించకపోవడంతో అంచనాల్లో మార్పులు చేయడం తప్ప పనులు మాత్రం చేయడం లేదు.

అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ల నిర్మాణంపై సాచివేత ధోరణి

దివిసీమ ప్రాంతంలోని కోడూరు, నాగాయలంక మండలాల్లో ఏడు అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లను నిర్మించేందుకు రూ.34 కోట్లతో అంచనాలు రూపొందించారు. గుడివాడ డ్రెయినేజీ విభాగం అధికారులు వీటి నిర్మాణం కోసం నాలుగైదు సంవత్సరాల క్రితమే అంచనాలు తయారు చేశారు. గతేడాది జనవరిలో సాంకేతిక నిపుణులు అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లను పరిశీలించారు. గతంలో తయారు చేసిన అంచనాలను కాకుండా ఇప్పుడున్న ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ల నిర్మాణానికి అంచనాలు రూపొందించి అనుమతులు ఇస్తామని అధికారులు అప్పట్లో చెప్పారు. గతేడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ దివిసీమ ప్రాంతంలో పాడైన అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లను బాగు చేయాలని కోరారు. అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు పాడవడంతో గత ఐదారు సంవత్సరాలుగా కోడూరు మండలం హంసలదీవి, ఇరాలి, తదితర గ్రామాల్లోని పొలాల్లోకి ఉప్పునీరు చొచ్చుకు వస్తుండటంతో ఐదు వేల ఎకరాల్లో వరి నాట్లు వేయకుండా క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి వ స్తోందని రైతులు చెబుతున్నారు.

మచిలీపట్నంలో మరమ్మతుల ఊసేది?

మచిలీపట్నం మండలంలోని భోగిరెడ్డిపల్లి, నెలకుర్రు, ఎన్‌.గొల్లపాలెం, తుమ్మలచెరువు, తుమ్మలపాలెం, చిన్నాపురం, కోన, వాడపాలెం, వెంకట దుర్గాంబపురం, కొత్తపల్లె తుమ్మలపాలెం, వాడగొయ్యి, పెదయాదర, కమ్మవారి చెరువు గ్రామాల పరిధిలోని పొలాల్లోని మురుగు డేగలకోడు, న్యూకోనడ్రెయిన్‌, కేపీటీపాలెం డ్రెయిన్‌, యాదర డ్రెయిన్‌, వాడగొయ్యి డ్రెయిన్‌, మంగల్లంకకోడు, మధ్యకాలువల ద్వారా కోన-వాడపాలెం గ్రామాల మధ్య సముద్రపు కరకట్ట కింద ఉన్న అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ల ద్వారా సముద్రంలో కలుస్తుంది. సముద్రపు కరకట్ట కింద ఉన్న అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ పాత, కొత్త అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ల గేట్ల్లు పాడయ్యాయి. దీంతో వీటి నుంచి పొలాల్లోకి ఉప్పునీరు చొచ్చుకు వచ్చి 12 గ్రామాల పరిధిలోని ఐదువేల ఎకరాల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల వాడపాలెం గ్రామస్థులు కలెక్టరేట్‌కు వచ్చి ఈ వేసవిలోనైనా ఈ స్లూయిస్‌ గేట్లకు మరమ్మతులు చేయాలని అధికారులకు వినతిపత్రం అందించారు. గతేడాది జూన్‌లో జరిగిన సాగు నీటి సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలోని అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లను పరిశీలించి వాటి నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని సూచించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరితో పాటు, కలెక్టర్‌ బాలాజీకి రెండు నియోజకవర్గాల రైతులు తరచూ అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ల నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ల నిర్మాణానికి అంచనాలు తయారు చేశామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 01:22 AM