నడిపించుకుంటూ కోర్టుకు..
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:08 AM
టీడీపీ కార్యకర్తను దారుణంగా హతమార్చిన కేసులో నిందితులకు తుని రూరల్ పోలీసులు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. మొత్తం 12మంది నిందితులను అరెస్ట్ చేసి, వారిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.
హత్య కేసు నిందితులకు పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్
తుని రూరల్, జనవరి 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యకర్తను దారుణంగా హతమార్చిన కేసులో నిందితులకు తుని రూరల్ పోలీసులు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. మొత్తం 12మంది నిందితులను అరెస్ట్ చేసి, వారిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో కొన్నేళ్లుగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఈ నెల 16న గ్రామంలో ఓ టీడీపీ నాయకుడి పుట్టినరోజు వేడుకలకు పలువురు టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. వీరంతా రాత్రి 8 గంటల సమయంలో సమీపంలోని రామాలయం వద్ద జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమం చూసేందుకు వెళ్తున్నారు. అప్పటికే కోటనందూరు వైసీపీ మండల అధ్యక్షుడు చింతకాయల చినబాబు ఇంటివద్ద కొంతమంది వైసీపీ శ్రేణులు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో కాపుకాశారు. అటుగా వచ్చిన టీడీపీ కార్యకర్తలపై పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య మృతి చెందాడని, ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని డీఎస్పీ తెలిపారు. సరిపడా వాహనం అందుబాటులో లేకపోవడంతో నిందితులను కాలినడకన కోర్టుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.