Share News

Medical Students Mental Health: శిక్షణతో మెడికోల ఒత్తిళ్లకు చెక్‌!

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:28 AM

ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో చదువుతున్న చాలా మంది ఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు! తీవ్రమైన మానసిక కల్లోలంతో కొందరు...

Medical Students Mental Health: శిక్షణతో మెడికోల ఒత్తిళ్లకు చెక్‌!

  • మొదటి సంవత్సరం వారిలో మరీ ఎక్కువ

  • యూజీ విద్యార్థుల్లో 28శాతం, పీజీ విద్యార్థుల్లో 15శాతం మందికి మానసిక సమస్యలు.. ఎన్‌ఎంసీ నివేదిక

  • ‘క్యూపీఆర్‌’ ఒప్పందంతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

  • వారి మానసిక స్థితి అంచనా వేసి.. కౌన్సెలింగ్‌

  • ఒత్తిడికి చెక్‌.. తద్వారా ఆత్మహత్యల నివారణ

  • దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వినూత్న కార్యక్రమం

గుంటూరు మెడికల్‌ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని ఇటీవల అదృశ్యమైంది. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు.. పోలీసుల విచారణ చేపట్టగా, ఆ విద్యార్థిని చెన్నై రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే గుంటూరు తీసుకువచ్చారు. విచారణలో ఆ వైద్య విద్యార్థిని మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు గురై కాలేజీని నుంచి వెళ్లిపోయినట్లు తేలింది.

గుంటూరు జిల్లాలోని ఓ వైద్య కళాశాలలో ఎనస్థీషియా పీజీ కోర్సు చేస్తున్న ఓ విద్యార్థిని.. ఆపరేషన్‌ థియేటర్‌లో రోగికి మత్తు మందు ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సదరు విద్యార్థిని పని ఒత్తిడితో పాటు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై.. సృహ తప్పినట్లు న్యూరాలజిస్టులు గుర్తించారు.

(గుంటూరు మెడికల్‌-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో చదువుతున్న చాలా మంది ఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు! తీవ్రమైన మానసిక కల్లోలంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్ప డుతున్నారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్థుల్లో 27.8 శాతం మంది, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్థుల్లో 15 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు జాతీ య వైద్య కమిషన్‌ 2024లో నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ‘నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌బీయింగ్‌ ఆఫ్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఎంబీబీఎస్‌ మొదటి ఏడాదిలో చేరిన విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని వివిధ అధ్యయనాల్లోనూ తేలింది. విద్యార్థుల సమస్యలను సకాలంలో గుర్తించి, తగిన చికిత్స అందించకపోతే.. ఎంతో విలువైన ఆ విద్యార్థుల జీవితం గాడి తప్పుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని నిర్మూలించేందుకు, ఆత్మహత్యలను నివారించేందుకు, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అమెరికాకు చెందిన క్వశ్చన్‌ పర్స్యూడ్‌ రిఫర్‌ (క్యూపీఆర్‌) ఇనిస్టిట్యూట్‌ ఇండియా అనే సంస్థతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ గత వారం ఒప్పందం చేసుకుంది. వైద్య విద్యార్థుల మానసిక వికాస కల్పన శిక్షణలో ఒప్పందం జరగడం దేశంలో ఇదే తొలిసారి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.


కళాశాలల వారీగా విద్యార్థులకు శిక్షణ

2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం చేరిన విద్యార్థుల్లో మానసిక వికాసం పెంపొందించేందుకు, ఒత్తిడిని పారదోలేందుకు, ఆత్మహత్యల ఆలోచనల నుంచి బయటపడేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం కళాశాలల వారీగా తేదీలను ఎంపిక చేయనున్నారు. విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై ‘అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌’ అనే సంస్థకు చెందిన ప్రవాస భారతీయురాలు, చిన్న పిల్లల మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ అపర్ణ ఉప్పల సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఆమె ఎమోషనల్‌ అసిస్టెంట్‌ ఆఫ్‌ స్డూడెంట్స్‌ బై ఎడ్యుకేటర్స్‌(ఈజ్‌)కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. క్యూపీఆర్‌ సంస్థ ద్వారా వైద్య విద్యార్థులకు అందించే శిక్షణ కార్యక్రమాలను డాక్టర్‌ అపర్ణ పర్యవేక్షిస్తారు.

ప్రశ్నావళి ద్వారా మానసిక స్థితి అంచనా

శిక్షణలో భాగంగా మానసిక వైద్య నిపుణులు నేరుగా విద్యార్థులతో సమావేశమై.. వారిలో సందేహాలను నివృత్తి చేస్తారు. ప్రశ్నావళి ద్వారా విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేసి.. దానికి అనుగుణంగా కౌన్సెలింగ్‌ ఇస్తారు. ప్రతి వైద్య కళాశాలలో ఎంపిక చేసిన సమన్వయకర్త ద్వారా శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు మేలు చేకూర్చే విధంగా నిర్వహిస్తామని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం నుంచి విద్యార్థులకు ఐదేళ్ల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ తెలిపారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాలకు అయ్యే వ్యయాన్ని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ భరిస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 05:29 AM