సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:34 PM
కర్నూలు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ విక్రాంత పాటిల్ వెల్లడించారు.
రౌడీషీటర్ల కదలికపై ప్రత్యేక దృష్టి
ఓటర్లను ప్రలోబాలకు గురి చేస్తే కఠిన చర్యలు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్
కర్నూలు క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ విక్రాంత పాటిల్ వెల్లడించారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పాతనేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా ఉంచామన్నారు. జిల్లాలో స్థానిక ఎన్నికల ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో ముఖాముఖి నిర్వహించారు.
ప్రశ్న : సమస్యాత్మక కేంద్రాలపై ఎలాంటి దృష్టి పెట్టారు..?
ఎస్పీ: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించాం. ఈ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. జిల్లా వ్యాప్తంగా 1280 సమస్యాత్మక కేంద్రాలు, 927 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
ప్రశ్న : హింసాత్మక ఘర్షణలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు..?
ఎస్పీ: ఇటీవల జరిగిన నామినేషన్ల సందర్బంగా కూడా అక్కడక్కడ రెండు, మూడు ఘటనలు మినహాయించి ఎలాంటి ఘర్షణలు తలెత్తలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాబోయే సర్పంచుల నామినేషన్లకు కార్పొరేషన, మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు కూడా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. స్ర్టైకింగ్ పోర్స్ బృందాలు ఏర్పాటు చేశాం. సివిల్ సిబ్బందితో పాటు ఏఆర్, బెటాలియన నుంచి కూడా పలు బృందాలు ఏర్పాటు చేశాం. ఏమైనా ఘర్షణలు తలెత్తితే అక్కడికి వెళ్లేందుకు బలగాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే గ్రామాల్లో కార్డెన సెర్చ్‌లు, వెహికల్ చెకింగ్లు నిర్వహించాం. ట్రబుల్ మాంగర్స్, ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడే వారిని గుర్తించి బైండోబర్ కేసులు నమోదు చేశాం. ఈ బైండోవర్లు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జైలు శిక్షలు కూడా ఉంటాయి.
ప్రశ్న : కోడ్ ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు?
ఎస్పీ: రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమావళి ప్రకారం అందరూ నడుచుకోవాలి. ఈ ఎన్నికల నియమావళి అమలుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయి. స్టాటిస్టిక్ సర్వేలెన్స టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసీసీ బృందాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 8 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు జిల్లాలో 4 చెక్‌పోస్టులు ఇప్పటికే ఏర్పాటు చేశాం. కోడ్ ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే కొన్ని కేసులు నమోదు చేశాం. ఓటర్లను ప్రలోబాలకు గురి చేసినా, నగదు, మద్యం పంపిణీ చేసినా చర్యలు ఉంటాయి. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నాం. పోటీల్లో నిలబడే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించే విదంగా సమావేశాలు నిర్వహించాం. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలపై నిఘా పెట్టాం. ఎవరైనా తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చేశాం. డ్రోన, బారీ బారీ కెమెరాలు వినియోగిస్తున్నాం.
ప్రశ్న : ఓటర్లకు పోలీసుల నుంచి భరోసా?
ఎస్పీ: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టాం. ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో వేసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసినా ప్రలోబాలకు గురి చేసినా వారి ఓటు హక్కును అడ్డుకునేలా చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులకు, సిబ్బందికి అన్ని ఆదేశాలు జారీ చేశాం.
ప్రశ్న : నగదు, మద్యం అక్రమ రవాణాపై తీసుకున్న చర్యలు?
ఎస్పీ: నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ఓటర్లను ప్రలోబాలకు గురి చేయకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వీటిని కట్టడి చేసేందుకు నిఘా బృందాలు పని చేస్తున్నాయి. ఎన్నికల బృందాలతో పాటు ప్రత్యేకంగా పోలీసు టీమ్‌లను నియమించాం. నగదు రవాణా చేసే వారు తప్పనిసరిగా వారి లెక్కలు చూపించాల్సిందే.