Share News

మరికొద్ది రోజుల్లో ‘ప్రత్యేక‘ పాలన!

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:56 AM

స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసే సమయం ఆసన్నం కావడంతో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాల్టీలు, 800 వరకు పంచాయతీలకు అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి కలెక్టర్‌ వరకు ఆయా బాధ్యతలను నిర్వర్తించేం దుకు రెడీ అవుతున్నారు.

మరికొద్ది రోజుల్లో ‘ప్రత్యేక‘ పాలన!

- త్వరలో ముగియనున్న పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం

- ఉమ్మడి కృష్ణాలో 2 కార్పొరేషన్లు, 7 మున్సిపాల్టీలు, 800 వరకు పంచాయతీలు

- సిద్ధమవుతున్న ప్రత్యేక అధికారుల జాబితాలు

స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసే సమయం ఆసన్నం కావడంతో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాల్టీలు, 800 వరకు పంచాయతీలకు అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి కలెక్టర్‌ వరకు ఆయా బాధ్యతలను నిర్వర్తించేం దుకు రెడీ అవుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం వెయ్యికిపైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పాలకవర్గాల కాలపరిమితి త్వరలో ముగియనుంది. గ్రామ పంచాయతీలకు మార్చి, 2021లో ఎన్నికలు జరిగాయి. 2022లో జిల్లాల పునర్విభజన జరిగింది. ఈ క్రమంలో కొన్ని పంచాయతీలు ఏలూరు జిల్లాలోకి వెళ్లాయి. కేవలం 800 లోపు పంచాయతీలు మాత్రమే ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల పరిధిలో ఉన్నాయి. గ్రామపంచాయతీలకు పంచాయతీ కార్యదర్శులనే ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీలకు మాత్రం మండల స్థాయి అధికారులైన రెవె న్యూ ఇన్‌స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌, ఈవోపీఆర్డీ, డిప్యూటీ ఎంపీడీవో, ఎంపీడీవోలను నియమించనున్నారు. అలాగే ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, వ్యవసాయ తదితర ఇతర శాఖల మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం ఏడు మున్సిపాల్టీలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో తిరువూరు, నందిగామ, కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాల్టీలు ఉండగా.. కృష్ణాజిల్లాలో పెడన, గుడివాడ, ఉయ్యూరు మున్సిపాల్టీలు ఉన్నాయి. ఈ మున్సిపాల్టీలకు ఈ నెలలోనే గడువు ముగియబోతోంది. పురపాలక సంఘాలకు మాత్రం జేసీ, డివిజినల్‌ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు.

కార్పొరేషన్లకు స్పెషల్‌ ఆఫీసర్లుగా కలెక్టర్లు!

విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లకు ఈ నెల 18తో పాలకపక్షాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌కు కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీ స్పెషల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఎన్నికలు నిర్వహించే వరకు స్థాయీ సంఘ సమావేశాలు, ముఖ్యమైన సమావేశాలన్నింటినీ మేయర్ల స్థానంలో కలెక్టర్లు నిర్వహిస్తుంటారు. కౌన్సిల్‌ సమావేశాలు అనేవి.. ఇక మీదట అధికారులు, స్పెషల్‌ ఆఫీసర్ల చాంబర్లలోనే నిర్వహిస్తారు.

స్పెషల్‌ ఆఫీసర్లకు అనుగుణంగా చాంబర్లు!

ప్రజాప్రతినిధుల స్థానంలో స్పెషల్‌ ఆఫీసర్లు బాధ్యతలు నిర్వహించాల్సి ఉండటంతో దానికి అనుగుణంగా చాంబర్లను తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకంగా చాంబర్లు కాకపోయినా.. ఉన్న చాంబర్లనే ప్రత్యేక వసతులతో సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకాధికారులతో కూడిన నేమ్‌ బోర్డులకు కూడా ఆర్డర్‌ ఇస్తున్నారు. ప్రత్యేకాధికారుల దగ్గర పనిచేసే సిబ్బందికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. మరీ ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్లలో ఈ వ్యవహారం ఎక్కువుగా జరుగుతోంది.

Updated Date - Mar 09 , 2026 | 12:56 AM