పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:35 AM
రాష్ట్రంలో ఈనెల 17వ తేదీతో పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం పూర్తవుతోంది. వాటి స్థానాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానుంది.
11 కార్పొరేషన్ల బాధ్యత కలెక్టర్లకు
75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకూ ప్రత్యేకాధికారులు
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈనెల 17వ తేదీతో పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం పూర్తవుతోంది. వాటి స్థానాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానుంది. ఈ నేపథ్యంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 86 పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వాటి స్థాయిలను బట్టి జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, సమానస్థాయి అధికారులైన గ్రూప్-1 ఆఫీసర్లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఆరు నెలల కాలం లేదా కొత్తగా ఎన్నికయ్యే పాలక వర్గాలు అధికారంలోకి వచ్చే వరకు.. ఏది ముందు అయితే అంతవరకు ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు.