Share News

గ్రామాల్లో ప్రత్యేక పాలన!

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:27 AM

ఏప్రిల్‌ 2 నాటికి గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియనుంది. దీంతో కొంతకాలం గ్రామీణ పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

గ్రామాల్లో ప్రత్యేక పాలన!

  • మండలాధికారులకు పగ్గాలు

  • ఏప్రిల్‌ 2తో ముగియనున్న పంచాయతీల పదవీకాలం

  • జూన్‌ తర్వాతే ఎన్నికలకు చాన్స్‌

  • డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక వచ్చాకే బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ అమలు

  • గ్రామాల్లో అభివృద్ధి పూర్తికి సమయం

  • సాహ్ని స్థానంలో నీరబ్‌కు అవకాశం

  • ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లేలా నిర్ణయం

  • తొలుత పరిషత్‌.. తర్వాత పంచాయతీ?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏప్రిల్‌ 2 నాటికి గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియనుంది. దీంతో కొంతకాలం గ్రామీణ పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్నికలు జరిగే వరకు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక పాలనాధికారులుగా ఆయా మండలాల అధికారులను నియమించనున్నారు. మరోవైపు, ఈ నెలాఖరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని పదవీకాలం ముగియనుంది. ఆమె స్థానంలో రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను నియమించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించింది. 45 రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు సూచించింది. ఈ నివేదిక వచ్చాక బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ నివేదిక వచ్చేందుకు కనీసం రెండు నెలలు పడుతుంది. మరోవైపు, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేందుకు కనీసం ఒక నెల గడువు అవసరం. ఈ నేపథ్యంలో జూన్‌ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు.


ముందు ఏ ఎన్నికలు?

ఏప్రిల్‌ 2 నాటికి గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియనుండటంతో ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఆలస్యమైనా.. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టుకు ఎక్కినా.. పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. మరోవైపు, సెప్టెంబరులో మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో ఏ ఎన్నికలు ముందు నిర్వహించాలనే విషయం సమస్యగా మారే అవకాశముంది. ఈ క్రమంలో తొలుత పరిషత్‌, తర్వాత గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. కూటమి పార్టీలకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకుండా జరుగుతాయి. ఈ సమయంలో సహజంగా గ్రామాల్లో గ్రూపులు ఏర్పడతాయి. ఈ గ్రూపుల ప్రభావం మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కనిపిస్తుంది. అలాకాకుండా.. ముందుగా పార్టీ గుర్తులతో నిర్వహించే పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తే.. కూటమి నేతలు పూర్తిస్థాయిలో పదవులు కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనంతరం.. సర్పంచ్‌ ఎన్నికలు చేపడితే కూటమి పార్టీలకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో పరిషత్‌ ఎన్నికల తర్వాతే సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించాలనే వాదన వినిపిస్తోంది.


అభివృద్ధి నినాదం!

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఒక అవగాహనతో ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలో ఇప్పటికే 8 వేల కిలో మీటర్ల మేర సిమెంట్‌రోడ్లతో పాటు 34 వేల మినీ గోకులాల నిర్మాణాలు చేపట్టారు. ‘పల్లెపండుగ 2.0’ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇలా పంచాయతీల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. వీటిని ప్రజలకు వివరించి ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వాన్ని తప్పకుండా ఆదరిస్తారని వారు భావిస్తున్నారు.


బీసీ రిజర్వేషన్లపై..

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. అయితే, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టు సూచించిన ‘ట్రిపుల్‌ టెస్ట్‌’ను అనుసరించకుండా ఎన్నికలకు వెళ్లడంతో న్యాయస్థానం ఎన్నికలను నిలిపివేసింది. ట్రిపుల్‌ టెస్ట్‌ ప్రకారం డెడికేటెడ్‌ కమిషన్‌ వేసి ఏయే ప్రాంతాల్లో బీసీలకు ఏ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలో జనాభా ప్రాతిపదికన అధ్యయనం చేయాలి. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదు. అయితే ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం కోటా కల్పించాలని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ రెండు కేటగిరీలకు పోను మిగిలిన 29 శాతం మాత్రమే బీసీలు, మైనారిటీలకు అమలు చేయాలి. దీనిలో మైనారిటీలకు 4 శాతం అమలు చేస్తే బీసీలకు ఇక 25 శాతం మాత్రమే అమలు చేసే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోతే ఎన్నికలు నిలిచిపోతాయి. ఇక, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఇబ్బందేనని కూటమి నేతలు భావిస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని, ఆ తర్వాత న్యాయపరమైన వివాదాలు ఏర్పడితే ప్రజలు అర్థం చేసుకుంటారని.. నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే పంథాలో ముందుకెళ్లినా జూన్‌ తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Updated Date - Mar 04 , 2026 | 03:28 AM