ఎమ్మెల్యేలకు నో వర్క్.. నో పే!
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:06 AM
ఉద్యోగులకు ఏవిధంగా అయితే ‘నోవర్క్.. నోపే’(పని చేయకపోతే.. చెల్లింపులు లేవు) చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు కూడా వర్తింపజేయాలని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
అప్పటికీ వినకుంటే రీకాల్ చేసే హక్కును ప్రజలకు కల్పించాలి
అవసరమైతే చట్టాన్ని సవరించాలి
అఖిల భారత స్పీకర్ల సమావేశంలో శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు ఏవిధంగా అయితే ‘నోవర్క్.. నోపే’(పని చేయకపోతే.. చెల్లింపులు లేవు) చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు కూడా వర్తింపజేయాలని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవులో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ‘ప్రజల పట్ల శాసనవ్యవస్థ జవాబుదారీతనం’ అనే అంశంపై అయ్యన్న మాట్లాడారు. ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే వారి వేతనాల్లో కోత పెట్టినట్లే, చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధుల జీతభత్యాల్లో కూడా కోత విధించాలని సూచించారు. అప్పటికీ గుణపాఠం నేర్చుకోని ప్రజా ప్రతినిధులను మళ్లీ ప్రజాకోర్టులో నిలబెట్టాలని, దీనికోసం అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ప్రజలకు ‘రైట్ టు రీకాల్’(ఎన్నికను రద్దు చేసే) హక్కు కల్పించాలని సూచించారు. పారదర్శకత లోపించిన ఏ వ్యవస్థా ప్రజలకు జవాబుదారీ కాజాలదని, ఈ కారణంగానే మన రాజ్యాంగంలో శాసనవ్యవస్థను అత్యంత పారదర్శకంగా పనిచేసేలా రూపొందించారని అయ్యన్న పేర్కొన్నారు. శాసనవ్యవస్థలో ప్రతి పనీ ప్రజలకు తెలిసే జరుగుతుందని, అందుకే శాసనవ్యవస్థను అద్దాల మేడతో పోలుస్తారన్నారు. అయితే, కొందరు శాసనసభ్యులు తమ విధులను నిర్వర్తించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఏపీ విషయానికే వస్తే 2024 ఎన్నికల తర్వాత శాసనసభకు ఎన్నికైన సభ్యుల్లో కొంత మంది ఒక్క రోజు కూడా సభకు రానివారు ఉన్నారని, అది చాలదన్నట్లు సభకు హాజరుకాకపోయినా వారిలో కొందరు క్రమం తప్పకుండా వేతనాలు, భత్యాలు తీసుకుంటున్నారని తెలిపారు. సభాపతిగా ఇది తనకు ఎందో వేదన కలిగిస్తోందన్నారు. ఇలాంటి అనైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా అనైతిక వ్యవహారశైలిని నిషేధించే నిబంధనలేవీ లేవు కాబట్టి, ఈ విషయంలో తమకొక మార్గం చూపించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను అయ్యన్నపాత్రుడు అభ్యర్థించారు. కాగా, మాతృభాష తెలుగులో ప్రసంగించిన అయ్యన్న పాత్రుడును పంజాబ్ శాసన సభ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ సభా ముఖంగా అభినందించారు.