చట్టసభలే ప్రజాస్వామ్యానికి గుండెకాయ
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:10 AM
ప్రజాస్వామ్యానికి చట్టసభలే గుండెకాయ అని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి: స్పీకర్ అయ్యన్న
మహోన్నతమైనది భారత రాజ్యాంగం: మండలి చైర్మన్ మోషేన్‌రాజు
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యానికి చట్టసభలే గుండెకాయ అని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అసెంబ్లీ భవనం ముందు మహాత్మాగాంధీ చిత్ర పటానికి ఆయన నివాళి అర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ‘గణతంత్ర రాజ్యానికి మూలం ప్రజలే. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. శాసనసభ్యులకు నో వర్క్-నో పే విధానం ఉండాలి. తీరు మార్చుకోని సభ్యులపై ప్రజలకు రీ కాల్ హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణంరాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, జాయింట్ సెక్రటరీ విజయరాజు, డిప్యూటీ సెక్రటరీలు రాజ్‌కుమార్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు కౌన్సిల్ భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలతో శాంతియుతంగా జీవించే హక్కును కల్పించిన భారత రాజ్యాంగం అన్ని గ్రంథాల కన్నా మహోన్నతమైనదన్నారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జాతీయ పతాకాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగమంతా లక్ష్యసాధనకు కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, సచివాలయ భద్రతాధికారి మల్లికార్జునరావు, సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.