ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:28 AM
అసెంబ్లీలో చర్చించే అంశాలపై సభపతి స్థానంలో ఉన్నవారు సాధారణంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయరని, కానీ, నేటి సమావేశం ప్రాముఖ్యత దృష్ట్యా ఒక సగటు తెలుగువాడిగా తన ఆవేదన...
తప్పులను ఒప్పుకొనే ధైర్యం, నిజాయితీ వారికి లేవు
చేతికి కొబ్బరికాయ దొరికినట్లు గత పాలకుల ప్రవర్తన
తిరోగామి విధానాలతో రాష్ట్ర విధ్వంసానికి కంకణం
రైతుల ఉసురు తగిలినా గుణపాఠం నేర్వలేదు
వైసీపీపై శాసనసభలో స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు
అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి, చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచేందుకు ఈ రోజైనా ఆ 11 మంది ప్రతిపక్ష సభ్యులు సభకు వస్తారని ఆశించాను. కానీ, తప్పులను సభాముఖంగా ఒప్పుకొనే ఽధైర్యం, నిజాయితీ వారికి లేవని అర్థమవుతోంది.
-శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో చర్చించే అంశాలపై సభపతి స్థానంలో ఉన్నవారు సాధారణంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయరని, కానీ, నేటి సమావేశం ప్రాముఖ్యత దృష్ట్యా ఒక సగటు తెలుగువాడిగా తన ఆవేదన, అభిప్రాయాలు పంచుకోదలిచానని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. శనివారం అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే కీలక తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టే ముందు స్పీకరు మాట్లాడారు. ‘ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షలకు ఈ పవిత్రమైన సభ ఒక ప్రతిరూపం. ఈ రోజు ఈ సభలో మన రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే విఘ్నాలను శాశ్వతంగా తొలగించే యజ్ఞం జరగబోతోంది. ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వాములయ్యే భాగ్యం మనందరికీ కలిగింది. కనీసం ఈ రోజైనా 11 మంది ప్రతిపక్ష సభ్యులు సభకు హాజరై ఈ తీర్మానాన్ని బలపరిచి, తమ తప్పులను సభా ముఖంగా ఒప్పుకొనే ఽధైర్యం, నిజాయితీ వారికి లేవని అర్థమవుతోంది. రైతన్నల ఉసురు తగిలిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకునే ఉద్దేశ్యం వారికి లేదనిపిస్తోంది. రాష్ట్రం సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, ఆనందంతో విలసిల్లేలా సుస్థిర మార్గాన్ని ఖరారు చేసినందుకు తెలుగు జాతి ఈనాటి సమావేశాన్ని చిరకాలం గుర్తుంచుకుంటుంది. 2014లో నడిసముద్రంలో చుక్కాని లేని నావలా కొట్టుమిట్టాడుతున్న నూతన రాష్ట్రాన్ని తీరం చేర్చే ఒక చారిత్రక బాధ్యతను తెలుగు ప్రజలు దార్శనికుడైన చంద్రబాబుకు అప్పగించారు.
ఆయన తన అపార అనుభవాన్ని రంగరించి, రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపడానికి ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు. చంద్రబాబు నాయకత్వం మీద అపారమైన విశ్వాసం చూపుతూ ఈ ప్రాంత రైతన్నలు తమ సారవంతమైన సాగు భూములను రాష్ట్రాభివృద్ధి కోసం త్యాగం చేశారు. అన్నదాతల అండ, ఆశీర్వాదాలతో వాయు, మనోవేగాలతో రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దురదృష్టవశాత్తూ 2019లో ఆ ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారటం సహజం. కానీ, పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, గత ప్రభుత్వాలు చేపట్టిన మంచి పనులను కొనసాగిస్తూనే, ప్రజలకు మరింత మేలు చేయడానికి కొత్త ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. కానీ, అందుకు భిన్నంగా 2019-24 వరకు పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టు ప్రవర్తించారు. ప్రజలకు మేలు చేసే ఏ మంచి పనీ కొనసాగరాదని ప్రతిజ్ఞ చేశారు. తిరోగామి విధానాలతో రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. వారి అప్రజాస్వామిక, ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం యాభై ఏళ్లు వెనకబడింది. రాజధాని కోసం, భూములిచ్చిన రైతులు వీధిన పడ్డారు. ఎందరో ప్రభుత్వ హింసకు బలయ్యారు. అలాంటి దురదృష్టకర పరిస్థితులు పునరావృతం కాకుండా, రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు తిరుగులేని పునాదులు వేయడానికి అమరావతి నగరాన్ని శాశ్వత రాజధానిగా శిలాక్షరాల్లో లిఖించవలసిన అవసరం వచ్చింది. చంద్రబాబు ధృఢసంకల్పం, కృషి ఫలితంగా, రాష్ట్ర విభజన చట్టంలో తగు సవరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. అందుకోసం అవసరమైన తీర్మానాన్ని చేయడానికి ఈ రోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం’ అన్నారు.