ఎస్పీ బాలు... బహుముఖి ప్రజ్ఞాశాలి
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:15 AM
అమరజీవి బాలసుబ్రహ్మణ్యం చిరస్మరణీయుడని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఎస్పీ బాలు 80వ జయంతి సందర్భంగా ...
కాంస్య విగ్రహావిష్కరణ సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు
నెల్లూరు సాంస్కృతికం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): అమరజీవి బాలసుబ్రహ్మణ్యం చిరస్మరణీయుడని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఎస్పీ బాలు 80వ జయంతి సందర్భంగా గురువారం రాత్రి నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంస్కారంలో బాలసుబ్రహ్మణ్యంను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బాలు తండ్రి సాంబమూర్తి హరికథా గానం చేస్తూ.. నిధులు సేకరించి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించేవారని తెలిపారు. తండ్రి బాటలోనే బాలసుబ్రహ్మణ్యం స్వరగాయకుడిగా, బహుముఖి ప్రజ్ఞాశాలిగా తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడంటూ కొనియాడారు. నెల్లూరులో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. బాలు కాంస్య విగ్రహం, స్మారక వనంతోపాటు ఎన్‌టీఆర్ పార్కు నిర్వహణను తమ ఫౌండేషన్ ద్వారా పర్యవేక్షిస్తామని సభాముఖంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, శ్రీసిటీ అధినేత రవి సన్నారెడ్డి, శాంతి బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి, డాక్టర్ సీవీకే రెడ్డి, సినీ సంగీత దర్శకుడు కీరవాణి, ఎస్పీ బాలు కుమారుడు చరణ్, ఎస్పీ శైలజ, మణిశర్మ, మనో తదితరులు పాల్గొన్నారు.