Share News

‘నైరుతి’ మందగమనం

ABN , Publish Date - Jun 14 , 2026 | 05:12 AM

నైరుతి రుతుపవనాల సమయంలో భారత ద్వీపకల్పానికి ఇరువైపులా ఉన్న అరేబియా సముద్రం, బంగాళాఖాతం ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి.

‘నైరుతి’ మందగమనం

  • ప్రశాంతంగా అరేబియా, బంగాళాఖాతం సముద్రాలు

  • జాడలేని అల్పపీడనాలు, తుఫాన్‌లు

  • రుతుపవనాల విస్తరణలో అవే కీలకం

  • దక్షిణ భారతంలో ఎండా, వానా పరిస్థితులు

  • ఎల్‌నినో కారణమంటున్న నిపుణులు

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

  • అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ

విశాఖపట్నం/అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సమయంలో భారత ద్వీపకల్పానికి ఇరువైపులా ఉన్న అరేబియా సముద్రం, బంగాళాఖాతం ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. నిజానికి మే నెలలో ఏర్పడే తుఫాన్‌లు/వాయుగుండాలు నైరుతి రుతుపవనాల రాకలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది రుతుపవన ముందస్తుకాలం (ఏప్రిల్‌, మే) ఎటువంటి తుఫాన్‌లు లేకుండానే ముగిసింది. గత ఏడాది నవంబరులో వచ్చిన ‘దిత్వా’ తరువాత ఇప్పటివరకూ రెండు సముద్రాల్లో ఎటువంటి తుఫాన్‌లు లేవు. సాధారణంగా మే నెలలో బంగాళాఖాతంలో తుఫాన్‌ పరిస్థితులు ఏర్పడాల్సి ఉంది. ఈ ఏడాది శ్రీలంక సమీపాన ఒక అల్పపీడనం ఏర్పడి సముద్రంలోనే బలహీనపడింది. ఆ తరువాత మరో అల్పపీడనం సముద్రంలోనే అంతమైంది. ప్రస్తుతం రెండు సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడేందుకు మరికొంత సమయం పడుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. అల్పపీడన వ్యవస్థలు లేకపోవడం వల్ల రుతుపవనాల విస్తరణ మందకొడిగా సాగుతోందన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పుభారతంలో కొంతప్రాంతం వరకు రుతుపవన మేఘాలు విస్తరించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండ తీవ్రతతో పాటు అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. కాగా పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. పసిఫిక్‌లో వేడెక్కిన ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావం అరేబియా సముద్రం, బంగాళాఖాతంపై పడిందని, అందుకే రెండు సముద్రాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన తరువాతే బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడతాయని వివరించారు.


రాయలసీమలో వర్షాలు.. కోస్తాలో ఎండ

ఉత్తర తమిళనాడు తీరం, దక్షిణ తెలంగాణల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఉత్తర తమిళనాడు మీదుగా తూర్పు, పడమరకు షీర్‌ జోన్‌ విస్తరించింది. దీనికితోడు కోస్తాలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. వీటి ప్రభావంతో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అనంతపురం జిల్లా రాయదుర్గంలో 5.7, మార్కాపురం జిల్లా కోవిలంపాడులో 4.1, చిత్తూరు జిల్లా బందరుపల్లెలో 3.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

నేడు పలు చోట్ల వర్షాలు

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల గాలులతో వర్షాలు కురుస్తాయని, కోస్తాలో మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఆదివారం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మో స్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Updated Date - Jun 14 , 2026 | 05:14 AM