Share News

దేశవ్యాప్తంగా ‘నైరుతి’ విస్తరణ

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:07 AM

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణాలో మిగిలిన ప్రాంతాలకు గురువారం విస్తరించడంతో దేశంలో..

దేశవ్యాప్తంగా ‘నైరుతి’ విస్తరణ

  • సాధారణం కంటే ఒక రోజు ఆలస్యం

  • జూలైలో ఆదుకున్న వాయుగుండం

  • కొన్ని చోట్ల కుంభవృష్టి.. తగ్గిన లోటు

  • పలుప్రాంతాల్లో కొనసాగుతున్న వర్షాభావం

విశాఖపట్నం, అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణాలో మిగిలిన ప్రాంతాలకు గురువారం విస్తరించడంతో దేశంలో రుతుపవనాల పురోగమి ప్రక్రియ ముగిసింది. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీకి కేరళలో ప్రవేశించే రుతుపవనాలు జూలై ఎనిమిదో తేదీకల్లా దేశమంతా విస్తరించాల్సి ఉండగా, ఒకరోజు ఆలస్యమైంది. గత నెల నాలుగో తేదీన కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు మొదటి నుంచి మందకొడిగా పురోగమించి, మధ్యలో కొన్ని రోజులు నిలిచిపోయాయి. ఇది ఎల్‌నినో ప్రభావమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా జూన్‌లో దేశవ్యాప్తంగా 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ పంటల సాగుపై ఇది తీవ్ర ప్రభావం పడింది. అయితే, ఈనెల రెండో తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో కేరళ నుంచి గుజరాత్‌ వరకు వర్షాలు పుంజుకున్నాయి. కొంకణ్‌, గోవా, గుజరాత్‌లో కుంభవృష్టి, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలోని లోనావాలాలో రెండురోజుల వ్యవధిలో 129 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దేశంలో జూలై ఒకటో తేదీ నుంచి గురువారం వరకు 73.8 మి.మీ.లకుగాను 101.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో దేశంలో వర్షపాతం లోటు 14 శాతానికి తగ్గింది. జూన్‌లో వర్షాభావంతో తీవ్ర దుర్భిక్షం నెలకొన్న జిల్లాల సంఖ్య 262 ఉండగా, అది గురువారం నాటికి 175కు తగ్గింది. అయితే దేశంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 350.85 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. ఇది గతేడాది కంటే 91.95 లక్షల హెక్టార్లు తక్కువ. 166 రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో శుక్రవారం మేఘావృత వాతావరణం నెలకొంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - Jul 10 , 2026 | 05:08 AM