నిరాశాజనకంగా ముగిసిన ‘నైరుతి’ ఆదుకున్న తీవ్ర వాయుగుండం
ABN , Publish Date - Oct 05 , 2026 | 07:10 AM
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ నిరాశాజనకంగా ముగిసింది. జూన్ ఒకటో తేదీన ప్రారంభమైన నైరుతి రుతుపవనాల సీజన్ సెప్టెంబరు నెలాఖరుతో ముగిసే సమయానికి 29 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
కోస్తాలో 8.44, సీమలో
13.82 మీటర్ల లోతున భూగర్భజలాలు
విశ్రాంత వాతావరణ అధికారి రామారావు విశ్లేషణ
విశాఖపట్నం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ నిరాశాజనకంగా ముగిసింది. జూన్ ఒకటో తేదీన ప్రారంభమైన నైరుతి రుతుపవనాల సీజన్ సెప్టెంబరు నెలాఖరుతో ముగిసే సమయానికి 29 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాతో (21 శాతం లోటు) పోలిస్తే రాయలసీమలో తక్కువ(40 శాతం లోటు) వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి సెప్టెంబరు మూడో వారం వరకు తీవ్ర వర్షాభావం నెలకొన్నప్పటికీ.. తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భ నీటి మట్టాలు ఆశాజనకంగా పెరిగాయి. సెప్టెంబరు నెలాఖరునాటికి కోస్తాలో సగటున 8.44 మీటర్లు, రాయలసీమలో 13.82 మీటర్లగా భూగర్భ జలాలు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షాలు, భూగర్భ నీటి మట్టాల తాజా స్థితిపై విశ్రాంత వాతావరణ అధికారి పీవీ రామారావు విశ్లేషించారు. రుతుపవనాల సీజన్‌లో కోస్తాలో 60 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈ ఏడాది 47 సెం.మీ. (21 శాతం తక్కువ), రాయలసీమలో 41 సెం.మీ.కుగాను 25 సెం.మీ. (40 శాతం లోటు) నమోదైంది. తీవ్ర వర్షాభావంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు అత్యంత నిరాశాజనకంగా ఉంది. తీవ్రవాయుగుండానికి ముందు కోస్తాలో 53 శాతం, రాయలసీమలో 69 శాతం వర్షపాతం లోటు ఉంది. సెప్టెంబరు ఐదో తేదీన కూడా నెల్లూరులో వడగాడ్పులు వీయడం అసాధారణం. దీంతో ఖరీఫ్ పంటల సాగుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది. తాగునీటికీ కటకట ఏర్పడింది. అయితే సెప్టెంబరు మూడో వారంలో తీవ్రవాయుగుండం వల్ల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో భూగర్భ జలాలతోపాటు ఇతర సాగునీటి వనరుల్లో పరిస్థితి మెరుగుపడింది. సెప్టెంబరు 22 నుంచి 25వ తేదీ వరకు కోస్తాలో 14 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది.
దీంతో సెప్టెంబరు నెలాఖరునాటికి కోస్తాలో భూగర్భజలాలు 8.44 మీటర్లు, రాయలసీమలో 13.82 మీటర్లకు పెరిగాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో ఏపీలో సగటున 1.27 మీటర్లు, రాయలసీమలో 0.5 మీటర్లు పెరిగాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 4.24 మీటర్లు పెరగడం విశేషం. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో 1.78 మీటర్లు, శ్రీకాకుళంలో 2.27 మీటర్ల మేర పెరిగాయి. సెప్టెంబరు 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు విశాఖ జిల్లాలో రికార్డుస్థాయిలో 33 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా విశాఖ నగరానికి వచ్చే వేసవిలో తాగునీటి సమస్య ఉండదని పీవీ రామారావు అంచనా వేశారు. అయితే, నగరంలో అధిక అంతస్థులతో భవనాలు నిర్మించే ప్రాంతాల్లో ఎండిపోయిన బోర్లు పూర్తిగా రీఛార్జి కాకపోవచ్చన్నారు. ఈశాన్య రుతుపవనాలతో కురవనున్న వర్షాలతో కోస్తాలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంద ని అంచనావేశారు.