కళింగపట్నం వరకూ నైరుతి విస్తరణ
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:05 AM
నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలోని కళింగపట్నం వరకు విస్తరించాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ఎక్కువ ప్రాంతాలకు, తమిళనాడులో..
రానున్న మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకూ..
విశాఖపట్నం, జూన్ 11(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలోని కళింగపట్నం వరకు విస్తరించాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ఎక్కువ ప్రాంతాలకు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలకు, బంగాళాఖాతం, పశ్చిమబెంగాల్, బిహార్‌లో కొన్ని ప్రాంతాలకు గురువారం విస్తరించాయి. రాయలసీమలో మిగిలిన ప్రాంతాలు, కోస్తాంధ్రలో ఎక్కువ భాగాలను రుతుపవనాలు తాకాయి. రానున్న రెండు, మూడురోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన కొద్ది ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, దక్షిణ, ఈశాన్య భారతంలో ఎక్కువ ప్రాంతాలకు వేగంగా విస్తరించిన రుతుపవనాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంలో మందగమనం నెలకొంది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతంలోని అనేక ప్రాంతాలు ఇంకా రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అసాధారణంగా దీర్ఘకాలం అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏర్పడకపోవడమే దీనికి కారణమని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. రుతుపవనాల పురోగతికి తుఫాను వ్యవస్థలు డ్రైవర్లవలే పనిచేస్తాయని, తేమగాలులను భూమిపైకి నెట్టడంలో దోహదం చేస్తాయని, తద్వారా రుతుపవనాల విస్తరణ వేగాన్ని పెంచుతాయని వివరించింది.