వివాదాలను పరిష్కరించుకుందాం!
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:58 AM
దక్షిణ భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమస్యలు, వివాదాల పరిష్కారం లక్ష్యంగా దక్షిణ ప్రాంతీయ మండలి(సదరన్ జోన్సల్ కౌన్సిల్) 31వ సమావేశం..
నేడు దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం
చెన్నై చేరుకున్న దక్షిణభారత రాష్ట్రాల సీఎంలు
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన నిర్వహణ
విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
అమరావతి, చెన్నై, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): దక్షిణ భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమస్యలు, వివాదాల పరిష్కారం లక్ష్యంగా దక్షిణ ప్రాంతీయ మండలి(సదరన్ జోన్సల్ కౌన్సిల్) 31వ సమావేశం గురువారం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీప కోవలం వద్ద జరుగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళం, కర్ణాటక రాష్ట్రాలు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలున్న ఈ మండలికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చైర్మన్‌గా, ప్రస్తుత సమావేశానికి ఆతిథ్యమిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అమిత్‌షా అధ్యక్షతన ఓ హోటల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు దక్షిణాది రాష్ట్రాల సీఎంలు బుధవారం సాయంత్రమే చెన్నైకి చేరుకున్నారు. దక్షిణభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమస్యలు, వివాదాలను పరిష్కరించడానికి ఈ మండలి ఒక అద్భుతమైన వేదికగా పని చేస్తుందని కేంద్రప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు-కేరళ, తమిళనాడు-కర్ణాటకు, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నదీ జలాల పంపిణీ వివాదాలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన విస్త్రత అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. జోనల్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక స్థాయీ కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలను జోనల్ కౌన్సిల్ స్థాయీ కమిటీ ముందుంచుతారు. అనంతరం మిగిలిన అంశాలను పరిశీలన కోసం జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు ఉంచుతారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య పరస్పరం నెలకొన్న సమస్యల పరిష్కారానికి, వాటి పురోగతిపై చర్చించనున్నారు.
మహిళలు, పిల్లలపై జరిగే అత్యాచార కేసుల దర్యాప్తు వేగవంతం, త్వరిత పరిష్కారం కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, అలాగే విద్యకు సంబంధించిన సమస్యలపైనా చర్చిస్తారు. ప్రాంతీయ స్థాయిలో ఉమ్మడి అంశాలపైనా చర్చ జరుగనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన సమస్యలు, నీటి పంపిణీకి సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ), పౌర విమానయానానికి సంబంధించిన సమస్యలు తదితరాలపైనా సమావేశంలో చర్చించనున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల సహకారంతో 2014 జూన్ నుంచి ఇప్పటి వరకూ వివిధ జోనల్ కౌన్సిళ్లు, వాటి స్టాండింగ్ కమిటీల సమావేశాలు మొత్తం 69 సార్లు జరిగాయని కేంద్రం పేర్కొంది. ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1956’లోని 15 నుంచి 22 సెక్షన్ల కింద దక్షిణ ప్రాంతీయ మండలి సహా మొత్తం ఐదు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు.
కీలక అంశాలు ప్రస్తావించనున్న చంద్రబాబు..
రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను ఈ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నడుమ సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంతోపాటు ఏపీ పునర్విభజన చట్టం అమలు, పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అంశాలను సీఎం లేవనెత్తనున్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తవుతున్నా పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలు కొలిక్కి రాలేదు. వాటిని సీఎం ప్రస్తావించనున్నారు. అలాగే, షెడ్యూల్ 9-10లోని సంస్థల విభజన, ఆస్తులు, అప్పుల పంపకం, పెండింగ్ ఆర్థిక అంశాల పరిష్కారంపై కేంద్రం చొరవ తీసుకోవాలని చంద్రబాబు కోరనున్నారు. రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలనూ ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, దుగరాజపట్నం పోర్టు, విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు, రైల్వే కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాల్లో కేంద్రం సహకారానికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అదే సమయంలో మిగిలిన ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు, నిధులు ఇవ్వాలని కోరనున్నారు.
చంద్రబాబుకు ఘన స్వాగతం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం సాయంత్రం విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నేతలు చంద్రశేఖర్, రవిబాబు తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సమావేశం జరిగే హోటల్‌కు ఆయన బయలుదేరి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం శివకుమార్, కేరళ సీఎం సతీశన్, ఆయా రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు కూడా వేర్వేరుగా సమావేశ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడే అమిత్‌షాతో ముఖ్యమంత్రులు వేర్వేరుగా భేటీ అయినట్లు తెలిసింది.