Share News

898 కోట్లతో ఫుట్‌వేర్‌ప్లాంట్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 04:56 AM

రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అడిడాస్‌ వంటి బ్రాండ్లకు బూట్లు సరఫరా చేసే దక్షిణ కొరియాకు చెందిన..

898 కోట్లతో ఫుట్‌వేర్‌ప్లాంట్‌

  • కుప్పంలో దక్షిణ కొరియా దిగ్గజం హ్వాసింగ్‌ భారీ పెట్టుబడి

  • వంద ఎకరాల్లో అత్యాధునిక పరిశ్రమ

  • 17,645 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు

  • తమిళనాడు నుంచి ఏపీకి ప్రాజెక్టు

  • నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం

చిత్తూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అడిడాస్‌ వంటి బ్రాండ్లకు బూట్లు సరఫరా చేసే దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత ‘హ్వాసింగ్‌ ఫుట్‌వేర్‌’ సంస్థ ఏపీలో అడుగు పెట్టబోతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రూ.898 కోట్ల అంచనా వ్యయంతో భారీ నాన్‌-లెదర్‌ ఫుట్‌వేర్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు శుక్రవారం ఈ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు. కుప్పం నియోజకవర్గం పొగురుపల్లెలో వంద ఎకరాల్లో ఈ అత్యాధునిక ప్లాంటును నిర్మించనున్నారు. మొదటి విడతలో రూ.309 కోట్లు, రెండోదశలో రూ.299 కోట్లు, మూడోదశలో రూ.292 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ కంపెనీ రాకతో కుప్పం ప్రాంతం అంతర్జాతీయ ఫుట్‌వేర్‌ హబ్‌గా అవతరించడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని చెబుతున్నారు. 17,645 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. గ్లోబల్‌ తయారీదారులను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ వల్లే ఈ ప్రాజెక్టు సాకరమైంది. పెట్టుబడిదారులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీకి ప్రత్యేక రాయితీల ప్యాకేజీని ఆమోదించింది. 30 శాతం పెట్టుబడి సబ్సిడీ ఇవ్వనుంది. పదేళ్ల పాటు విద్యుత్‌ టారిఫ్‌ రీయింబర్స్‌మెంట్‌, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ర్టేషన్‌ ఫీజుల నుంచి వంద శాతం మినహాయింపు, గ్రీన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కోసం డీకార్బనైజేషన్‌ సబ్సిడీ వంటివి ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టును మొదట తమిళనాడులో రూ.1720 కోట్లతో పెట్టేందుకు హ్వాసింగ్‌ ప్రతిపాదించగా, మూడు నెలల వ్యవధిలోనే అక్కడి నుంచి తప్పుకొని ఏపీకి తరలివచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యూహాలు రచించి ఈ మెగా ప్రాజెక్టును తీసుకొచ్చింది.


  • కుప్పంలో పరిశ్రమల జాతర

  • రూ.7939 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

  • నేడు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్న సీఎం

సీఎం చంద్రబాబు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పరిశ్రమలకు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.7939 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించడంతోపాటు పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. తొలి రోజు పరిశ్రమల ప్రతినిధులతో సీఎం సమావేశమై పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై చర్చించనున్నారు. ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. రూ.898 కోట్లతో ‘హ్వాసింగ్‌ ఫుట్‌వేర్‌’ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. దేశంలోనే తొలి బ్యాటరీ అనోడ్‌ మెటీరియల్‌ తయారీ కేంద్రాన్ని ఆత గ్రూప్‌ కుప్పంలో ఏర్పాటు చేయనుంది. పయనీర్‌ క్లీన్‌ ఆమ్‌ప్స్‌ ద్వారా విమానాల తయారీ యూనిట్‌కు సీఎం శంకుస్థాప చేయనున్నారు. రూ.952 కోట్లతో మూడు భారీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సిద్ధమైన ఏబిస్‌ ప్రొటీన్స్‌ చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు ఎంఎస్‌ఎంఈ పార్కును సీఎం ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు రావడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది.

Updated Date - Jul 03 , 2026 | 04:58 AM