రైల్వే జోన్‌తో రాష్ట్రం అభివృద్ధి
ABN , Publish Date - May 09 , 2026 | 04:31 AM
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, కొత్తగా వస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి క్రెడిట్ చోరీకి వైసీపీ యత్నిస్తున్నదని.. దీనిని ప్రజలు గమనిస్తున్నారని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు.
ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్న వైసీపీ.. క్రెడిట్ చోరీకీ ప్రయత్నిస్తోంది
ప్రజలు అంతా గమనిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్
విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, కొత్తగా వస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి క్రెడిట్ చోరీకి వైసీపీ యత్నిస్తున్నదని.. దీనిని ప్రజలు గమనిస్తున్నారని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. స్థానిక లాసన్స్‌బే కాలనీలోని తన కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్, జనసేన ప్రతినిధి శివతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ఆ ప్రాజెక్టుల క్రెడిట్ తమదేనని వైసీపీ ప్రచారం చేస్తోందన్నారు. గూగుల్, లూలు మాల్, ఐటీ తదితర సంస్థలకు భూములు కేటాయిస్తే వాటిపై వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన ఏడు హామీల్లో రైల్వే జోన్ కూడా ఉందని గుర్తుచేశారు. వాల్తేరు డివిజన్ రద్దుకు కేంద్రం పూనుకొంటే తాము దానిని విశాఖపట్నం డివిజన్‌గా కొనసాగేలా చేశామన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాల సంఖ్య తక్కువగానే ఉన్నా ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుందని, దానివల్ల ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 87 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారన్నారు. కోల్‌కత-చెన్నై రైల్వే లైన్‌ను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడం వల్ల సరకు రవాణా వేగవంతం అవుతుందన్నారు. అనంతరం జోన్‌కు గెజిట్ నోటిఫికేషన్ తెప్పించినందుకు డీఆర్‌యుసీసీ సభ్యులు చలసాని గాంధీ, పలువురు యూనియన్ నాయకులు ఎంపీ శ్రీభరత్‌ను సత్కరించారు.