Share News

నేటి నుంచే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:11 AM

కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ జూన్‌ 1 నుంచి ఉనికిలోకి వస్తోంది. దీంతో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు కావాలన్న ఉత్తరాంధ్ర ప్రజల నాలుగు దశాబ్దాల కల నెరవేరింది.

నేటి నుంచే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌

  • నేటి నుంచే కొత్త రైల్వే జోన్‌

  • 4 దశాబ్దాల ఉత్తరాంధ్ర కల సాకారం

  • 2019 ఎన్నికల ప్రచారంలో

  • జోన్‌ను ప్రకటించిన ప్రధాని మోదీ

  • నాడు భూమే కేటాయించని జగన్‌

  • కూటమి ప్రభుత్వం వచ్చాక ముడసర్లోవలో భూకేటాయింపు

  • జోన్‌ ఆపరేషన్స్‌కు శ్రీకారం చరిత్రాత్మక మైలురాయి: చంద్రబాబు

విశాఖపట్నం, మే 31(ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ జూన్‌ 1 నుంచి ఉనికిలోకి వస్తోంది. దీంతో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు కావాలన్న ఉత్తరాంధ్ర ప్రజల నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. జూన్‌ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మే ఐదో తేదీన రైల్వే శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది. శాశ్వత భవనాల నిర్మాణానికి భూమి కేటాయించి అప్పగించడంతోపాటు జోన్‌ కార్యకలాపాలను నిర్వహించడానికి (తాత్కాలికంగా) వీఎంఆర్‌డీఏకు చెందిన ‘డెక్‌’ భవనంలో రెండంతస్థులు కేటాయించింది. జోన్‌కు కేటాయించిన జనరల్‌ మేనేజర్‌, ఇతర అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. కూటమి హయాంలో రైల్వేజోన్‌ కార్యకలాపాలు ప్రారంభం కావడం చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.


సుదీర్ఘ పోరాటం..

తూర్పుతీరంలో కోల్‌కతా, చెన్నై మధ్య ఉన్న విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకతీతంగా సుదీర్ఘ కాలం పోరాడారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ కేంద్రంలో ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రైల్వే శాఖలో ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యంతో ఏళ్ల తరబడి అది కార్యరూపం దాల్చలేదు. ప్రధాని మోదీ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ వచ్చినప్పుడు రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఇందుకు భూములు కేటాయించలేదు. దీంతో జోన్‌ ఏర్పాటు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు సారథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముడసర్లోవ ప్రాంతంలో భూమి కేటాయించింది. తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఆమోదానికి కొంత సమయం పట్టింది. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రైల్వే మంత్రితో మాట్లాడడం, రాష్ట్రానికి చెందిన ఎంపీలకు బాధ్యతలు అప్పగించడంతో జోన్‌ కార్యకలాపాల ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఎట్టకేలకు జోన్‌ ప్రధాన కార్యాలయ భవనాల నిర్మాణానికి గత ఏడాది జనవరిలో ప్రధాని శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో అప్పటి వరకు నగరంలో వీఎంఆర్‌డీఏకు చెందిన ‘ది డెక్‌’ భవనంలో తాత్కాలికంగా జోన్‌ ఆఫీ్‌సకు రెండు అంతస్థులను రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. అయితే కేంద్రం కొత్త జోన్‌ ఆపరేషన్‌కు అవసరమైన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడంలో జాప్యం జరిగింది. చివరకు ఏప్రిల్‌ 28న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన నిమిత్తం విశాఖ వచ్చినప్పుడు జూన్‌ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యకలాపాలను ప్రారంభిస్తామని సభలో ప్రకటించారు. వారం రోజులు తిరక్కుండానే నోటిఫికేషన్‌ ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన గెజిట్‌లో కొత్త రైల్వే జోన్‌ పరిధి, అందులోని డివిజన్లు, స్టేషన్లు, రైల్వే లైన్ల నిడివి తదితర వివరాలను పేర్కొన్నారు. గెజిట్‌ విడుదల నేపథ్యంలో జీఎం, ఇతర సిబ్బంది విశాఖ వచ్చి కార్యాలయం నుంచి విధుల నిర్వహణకు ఏర్పాట్లుచేసుకున్నారు.


విశాఖ డివిజన్‌ పరిధి..

వాల్తేరు డివిజన్‌ను రెండుగా విభజించడం వల్ల ‘విశాఖపట్నం డివిజన్‌’ విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. రాయగడ 696 కిమీతో ఏర్పాటు కాగా విశాఖ డివిజన్‌కు 463 కిమీ మాత్రమే దక్కింది. ఇందులో ఇచ్ఛాపురం-పలాస-విశాఖపట్నం-దువ్వాడ సెక్షన్‌ 270 కిమీ. విజయనగరం-కూనేరు 102 కిమీ.. నౌపడ జంక్షన్‌-పర్లాకిమిడి 39 కిమీ.. బొబ్బిలి జంక్షన్‌-సాలూరు సెక్షన్‌ 17 కిమీ ఉంది. వీటితో పాటు సింహాచలం నార్త్‌-దువ్వాడ బైపాస్‌, వడ్లపూడి-దువ్వాడ, విశాఖపట్నం-జగ్గయ్యపాలెం వరకు 35 కి.మీ సెక్షన్లను విశాఖ డివిజన్‌లో ఉంచారు. తూర్పు కోస్తా జోన్‌లోని ఖుర్దా డివిజన్‌లో ఉన్న 53 కి.మీ పలాస-ఇచ్ఛాపురం సెక్షన్‌నూ ఇందులో చేర్చారు.

దక్షిణ మధ్య రైల్వే డివిజన్ల విభజన

సికింద్రాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని గుంతకల్‌, గుంటూరు డివిజన్ల నుంచి కొన్ని భాగాలను సికింద్రాబాద్‌కు మార్చారు. రాయచూర్‌-వాడి 108 కిమీలను గుంతకల్‌ డివిజన్‌ నుంచి, విష్ణుపురం-పగిడిపల్లి-జాన్‌పహాడ్‌ 142 కిమీలను గుంటూరు డివిజన్‌ నుంచి తొలగించి సికింద్రాబాద్‌ డివిజన్‌లో కలిపారు. సికింద్రాబాద్‌ డివిజన్‌లోని కొండపల్లి-మోటమర్రి 46 కిమీలను విజయవాడ డివిజన్‌కు మారుస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు.

ఇదీ దక్షిణ కోస్తా జోన్‌..

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఉన్న గుంతకల్‌, గుంటూరు, విజయవాడ డివిజన్లు, ఇప్పటివరకు తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఉన్న వాల్తేరు డివిజన్‌లో విడగొట్టిన భాగాన్ని కలిపి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌గా ఏర్పాటుచేశారు. ఇప్పటి వరకు తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలు చేశారు. ఇందులో ఒక భాగంతో కొత్తగా ‘రాయగడ డివిజన్‌’ ఏర్పాటు చేసి తూర్పు కోస్తా జోన్‌లో కలిపారు. మిగిలిన భాగానికి ‘విశాఖపట్నం డివిజన్‌’గా నామకరణం చేసి కొత్త జోన్‌లో ఉంచారు.


  • దశాబ్దాల కల నెరవేరుతోంది!

  • సీఎం చంద్రబాబు హర్షం

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సోమవారం(జూన్‌ 1) నుంచి అధికారికంగా ప్రారంభం కానుండటం చారిత్రాత్మక మైలు రాయిగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఆదివారం ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దశాబ్దాల కల నెరవేరుతోందని, నూతన రైల్వే జోన్‌ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తుందని, కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్‌ హబ్‌గా మార్చేందుకు ఇది కీలక మైలురాయి అన్నారు. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 05:33 AM